Uttarakhand Elections: ఉత్తరాఖండ్ ఎమ్మెల్యేల్లో కొత్త కలవరం.. అచితూచి వ్యవహరిస్తున్న బీజేపీ అధిష్టానం!
ఉత్తరాఖండ్‌లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న, భారతీయ జనతాపార్టీ ప్రచారంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంపికలోనూ అచితూచి వ్యవహరిస్తోంది.
Uttarakhand Assembly Elections 2021: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ఎత్తులు పైఎత్తులకు పదును పెడుతున్నారు. అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న, భారతీయ జనతాపార్టీ ప్రచారంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంపికలోనూ అచితూచి వ్యవహరిస్తోంది. అదేసమయంలో టికెట్ విషయంలో ఎలాంటి అవకాశాలను వదులుకోకూడదని అభ్యర్థులు భావిస్తున్నారు. 21 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ ఆత్మీయులతో పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు అరడజను మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ కానుందని బీజేపీ హైకమాండ్ సూచించడంతో పోటీదారులలో ఉత్కంఠ నెలకొంది.
మరోసారి ఉత్తరాఖండ్‌లో పాగా వేసేందుక బీజేపీ విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టింది. పార్టీలో అసమ్మతి ఉన్న సీనియర్ నేతలను సైతం ఈసారి పక్కనబెట్టాలని అధిష్టానం భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో చాలా మంది కొత్త ముఖాలను రంగంలోకి దించవచ్చని తెలుస్తోంది. అటువంటి పరిస్థితిలో అశావాహులు తమ తమ నియోజకవర్గాలలో వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు మండల, జిల్లా స్థాయి సంస్థల ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అదే సమయంలో, కొందరు నేరుగా రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేస్తున్నారు. తద్వారా టిక్కెట్‌కు బలమైన పునాది ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈసారి ఎలాగైనా టికెట్టు దక్కించుకోవాలని భావిస్తున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్యానెళ్లను సిద్ధం చేసేందుకు పార్టీ పరిశీలకులను కూడా పంపింది. రెండు మూడు రోజుల్లో పరిశీలకులందరూ అసెంబ్లీ నియోజకవర్గాల ప్యానల్‌ను సిద్ధం చేసి రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందజేయనున్నారు. దీని తర్వాత ప్యానెల్ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డుకు పంపనుంది. అభ్యర్థుల పేర్లపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలావుంటే, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఓం గోపాల్ రావత్‌కు ఈసారి కూడా టికెట్ దక్కేలా కనిపించడంలేదు. నరేంద్రనగర్ అసెంబ్లీ సీటుపై ఆశలు పెట్టుకున్న ఆయనకు మంత్రి రూపం చుక్కెదురు కానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి కేబినెట్ మంత్రి సుబోధ్ ఉనియాల్ కూడా పోటీ పడుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఓం గోపాల్ కూడా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం గాజా, గల్ఫ్ ప్రాంత ప్రజలతో సమావేశం నిర్వహించారు.
కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.మదన్ కౌశిక్ మాట్లాడుతూ.. బీజేపీలో క్రమశిక్షణే ప్రధానమన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీ ఫోరమ్‌లో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే ఒకరికి మాత్రమే టిక్కెట్ వస్తుందన్నారు. కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దాని ప్రాతిపదికన అందరూ ఏకమై కమలాన్ని గెలిపిస్తారనన్నారు.