AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇవీ.. భారత్ స్థానం ఏమంటే..?

ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ జాబితాలో చైనా, జర్మనీ, జపాన్, భారత్ తదితర దేశాలు చోటు దక్కించుకున్నాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన 10 దేశాల జాబితాలో ఏయే దేశం ఏ స్థానంలో ఉంది.. భారత్ స్థానం ఎంత? పొరుగు దేశం పాకిస్థాన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూద్దాం..

ప్రపంచంలో 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇవీ.. భారత్ స్థానం ఏమంటే..?
Indian Economy Richest Country
Janardhan Veluru
|

Updated on: Jan 08, 2025 | 9:36 PM

Share

ఆర్థిక పరిస్థితి ఆదారంగానే ఆ దేశ ప్రజల జీవనప్రమాణాలను లెక్కించడం సాధ్యం అవుతుంది. ఆర్థికంగా బలంగా ఉంటేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే ఆ దేశానికి పెట్టుబడులు ఎక్కువగా వస్తాయి.. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. మరి ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏవో తెలుసుకుందాం.. మరీ ముఖ్యంగా ఈ జాబితాలో భారత్ స్థానమేంటి? పాకిస్థాన్ ఏ స్థానంలో ఉంది? తదితర వివరాలు తెలుసుకుందాం..

1. అమెరికా (USA)

అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. దీని స్థూల దేశీయోత్పత్తి (GDP) $29 ట్రిలియన్ కంటే ఎక్కువ. అమెరికా సాంకేతికత, ఆర్థిక సేవలు, వినియోగదారుల మార్కెట్లు దీనిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అగ్రస్థానంలో నిలుపుతోంది. సిలికాన్ వ్యాలీ వంటి సాంకేతిక కేంద్రాలు ఈ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి.

2. చైనా:

చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. దీని GDP విలువ $18 ట్రిలియన్ కంటే ఎక్కువ. తయారీ, ఎగుమతులపై చైనా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఆదారపడి ఉంది. అదనంగా హై-టెక్నాలజీ రంగాలలోనూ చైనా వేగంగా దూసుకుపోతోంది.

3. జర్మనీ

ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో నిలుస్తోంది. దీని GDP విలువ $4.71 ట్రిలియన్లుగా ఉంది. ఆ దేశం ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది.

4. జపాన్

జపాన్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. దీని GDP $4 ట్రిలియన్లకు పైగా ఉంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ అత్యాధునిక సాంకేతికత, ఆటోమొబైల్ , ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలపై ఆధారపడి ఉంటుంది. టయోటా, సోనీ వంటి దిగ్గజ కంపెనీలు జపాన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతున్నాయి.

5. భారతదేశం

భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. దీని GDP దాదాపు $4 ట్రిలియన్లుగా ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ IT సేవలు, వ్యవసాయం, ఉత్పాదక రంగంపై ఆధారపడి ఉంటుంది. దేశ జనాభా, వినియోగదారుల మార్కెట్ దీనిని ప్రధాన ఆర్థిక శక్తిగా మార్చింది.

6. యునైటెడ్ కింగ్‌డమ్ (UK)

బ్రిటన్ ప్రపంంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. UK ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు $3.59 ట్రిలియన్లు. ఇది ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ , సాంకేతిక ఆవిష్కరణలతో బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక కేంద్రాలలో లండన్ ఒకటి.

7. ఫాన్స్

ఫ్రాన్స్ ప్రపంచంలో ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. ఆ దేశ GDP $3.17 ట్రిలియన్లుగా ఉంది.

8. ఇటలీ

ఇటలీ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు $2.38 ట్రిలియన్లు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా తయారీ, డిజైన్, వ్యవసాయంపై ఆధారపడి ఉంది. అలాగే పర్యాటక పరిశ్రమ ఆ దేశ ఆదాయానికి ప్రధాన వనరుగా నిలుస్తోంది.

9. కెనడా

కెనడా ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు $2.21 ట్రిలియన్లు. ఆ దేశం సహజ వనరులు, ఇంధన ఉత్పత్తి, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది.

10. బ్రెజిల్

బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ విలువ $2.19 ట్రిలియన్లు. బ్రెజిల్ దక్షిణ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. బ్రెజిల్ వ్యవసాయ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారుగా నిలుస్తోంది. దీనికి తోడు ఇనుప ఖనిజం, బాక్సైట్, చమురు ఉత్పత్తితో సహా ఖనిజ వనరులు దాని ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైనవి.

44. పాకిస్తాన్

ఈ జాబితాలో భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ 44వ స్థానంలో ఉంది. 2024లో పాకిస్థాన్ GDP US$374.6 బిలియన్లుగా ఉంది.

ప్రపంచంలో టాప్-10 ఆర్థిక వ్యవస్థలు

Rank Country GDP (USD)
1  అమెరికా (U.S) $29.17 ట్రిల్లియన్
2 చైనా $18.27 ట్రిల్లియన్
3 జర్మనీ $4.71 ట్రిల్లియన్
4 జపాన్ $4.07 ట్రిల్లియన్
5 ఇండియా $3.89 ట్రిల్లియన్
6  యునైటెడ్ కింగ్‌డమ్ (U.K.) $3.59 ట్రిల్లియన్
7 ఫ్రాన్స్ $3.17 ట్రిల్లియన్
8 ఇటలీ $2.38 ట్రిల్లియన్
9 కెనడా $2.21 ట్రిల్లియన్
10 బ్రెజిల్ $2.19 ట్రిల్లియన్

(2024 నవంబర్ 4న ఐఎంఎఫ్ విడుదల చేసిన గణాంకాల మేరకు ఈ వివరాలు ఇవ్వడం జరిగింది)