BJP Campaign Strategies: రాంచీ నుంచి ఆరంభం.. బీజేపీ జార్ఖండ్ ప్రచార వ్యూహం అదేనా..?
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 66 మంది అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ప్రకటించింది. జాబితాలో బాబులాల్ మరాండీ, చంపై సోరెన్, సుదర్శన్ భగత్ వంటి ప్రముఖులున్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం ఇచ్చిన ఊపుతో భారతీయ జనతా పార్టీ (BJP) త్వరలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దేశ ప్రజల్లో ఉన్న ఆదరణ చెక్కు చెదరకపోయినా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్న అంశాలు అనేకం ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు తగిన వ్యూహాలను అమలు చేయాలని భావిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానే అన్నట్టుగా ప్రధాని మోదీ ఒంటి చేతిపై ప్రచార బాధ్యతలు మోయడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని కమలదళం గ్రహించింది. అందుకే హర్యానా, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ పరిమిత సంఖ్యలో సభలకు హాజరయ్యారు. పదునైన ప్రసంగాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వీలైనంతమేర స్థానిక నాయకత్వానికే ప్రాధాన్యత కల్పించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న హర్యానాలో మోదీ తన నాయకత్వం కంటే నాయబ్ సింగ్ సైనీ నాయకత్వంపై ప్రజలకు భరోసా కల్పించగలిగారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో పరిమిత సంఖ్యలో సభలకు హాజరుకావాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్టు తెలిసింది. జార్ఖండ్ రాజధాని రాంచీతో మొదలుపెట్టి, జార్ఖండ్‌లోని 6 ప్రాంతాలను కవర్ చేసేలా మొత్తం 7 ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నారు.
చిన్న రాష్ట్రం – 6 ప్రాంతాలు
వైశాల్యంలో, జన సంఖ్యలో జార్ఖండ్ చిన్న రాష్ట్రమే అయినప్పటికీ ఈ రాష్ట్రాన్ని భౌగోళికంగా 6 ప్రాంతాలుగా విభజిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, దక్షిణ కోస్తా మాదిరిగా జార్ఖండ్‌లో పాలము, సంతాల్ పరగణ, కొల్హాల్, ఉత్తర చోటానాగ్‌పూర్, దక్షిణ చోటానాగ్‌పూర్, కోయిలాంచల్ ప్రాంతాలున్నాయి. బొగ్గు, ఇతర ఖనిజాల గనులు అధికంగా ఉన్న కోయిలాంచల్‌లో ధన్‌బాద్, బొకారో, గిరిదిహ్ పట్టణాలున్నాయి. బీజేపీ సంస్థాగతంగా రాష్ట్రంలో ప్రతి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని ప్రాంతాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తే అధికారం సాధ్యపడుతుందని భావిస్తోంది. అందుకో ప్రతి ప్రాంతంలో ప్రధాని మోదీతో ఒక సభ ఉండేలా ఏర్పాట్లు చేసింది. అలాగే రాష్ట్ర రాజధాని రాంచీ నగరంలో ఒక బహిరంగ సభ ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది.
అభ్యర్థుల జాబితా – అసంతృప్తి సెగలు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 66 మంది అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ప్రకటించింది. జాబితాలో బాబులాల్ మరాండీ, చంపై సోరెన్, సుదర్శన్ భగత్ వంటి ప్రముఖులున్నారు. సెరైకెలా నుంచి మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్‌ను పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. హేమంత్ సోరెన్ ఈడీ కేసులో జైలుపాలైనప్పుడు చంపై సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ మీద బయటికొచ్చిన హేమంత్ సోరెన్, చంపైను అవమానకరరీతిలో సీఎం పీఠం నుంచి దించేశారు. దీంతో ఆయన ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీలో చేరారు. ఆయన గిరిజన-ఆదివాసీ వర్గాల్లో పట్టున్న నేత.
మరోవైపు గండే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్‌పై మునియా దేవిని బీజేపీ బరిలోకి దించింది. తొలి జాబితా విడుదల చేసినప్పటి నుంచి పార్టీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. రాజకీయాల్లో టికెట్ ఆశించి భంగపడ్డవారు అసమ్మతి స్వరాన్ని వినిపించడం ఎక్కడైనా సహజమే. కానీ ప్రతిపక్షాల చేతిలో ఉన్న ఈ రాష్ట్రంలో మళ్లీ అధికారం సాధించాలని భావిస్తున్న బీజేపీ, ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో అసంతృప్తి సెగలు, అసమ్మతి రాగాల కారణంగా నష్టం జరగకూడదని కోరుకుంటోంది. అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత బీజేపీకి చెందిన పలువురు ప్రముఖ నేతలు పార్టీని వీడారు. వారిలో లూయిస్ మరాండి, కేదార్ హజ్రా, కునాల్ సారంగి, గణేష్ మహాలి, లక్ష్మణ్ తుడు, బాస్కో బెస్రా వంటి నేతలున్నారు. వీరంతా అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీలో చేరారు.
ఇదిలా ఉంటే.. బంధుప్రీతి, కుటుంబ వారసత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీ (BJP) ఈ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన పలువురికి టికెట్లు ఇచ్చిందన్న ఆరోపణ, విమర్శలు ఎదుర్కొంటోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఒకే కుటుంబ నేతలు కొందరు ఉండగా, పార్టీ నేతల్లో కొందరి బంధువర్గానికి కూడా టికెట్లు ఇచ్చిందని జేఎంఎం నేతలు ఆరోపిస్తున్నారు.
గనుల రాష్ట్రంలో చొరబాట్లు
జార్ఖండ్ రాష్ట్రం విలువైన ఖనిజాలు, గనులకు పెట్టింది పేరు. అలాంటి రాష్ట్రంలో బంగ్లాదేశీయుల చొరబాట్లు ఒక సమస్యగా మారింది. ఓటుబ్యాంకు రాజకీయాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చినవారిని పశ్చిమ బెంగాల్ సాదరంగా స్వాగతిస్తుంటే, అలా వచ్చినవారిలో కొందరు బెంగాల్‌కు ఆనుకున్న జార్ఖండ్‌లో కూడా స్థిరపడుతున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో సామాజిక స్వరూపం మారిపోతోంది. దీంతో ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీతో పాటు కమలదళం నేతలు అక్రమ మైనింగ్, బంగ్లాదేశీయుల చొరబాట్లు, లవ్ జిహాద్, జనాభా మార్పు, క్రైస్తవ మతప్రచారకులు ప్రలోభాలతో గిరిజన-ఆదివాసీలను మతమార్పిళ్లు చేయడం వంటి అంశాలను ఎక్కుగా ప్రస్తావించే అవకాశం ఉంది. రాంచీలో ఏర్పాటు చేసే తొలి సభలో ప్రధానమంత్రితో పాటు మిత్రపక్షాల నాయకులు నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, సుధేష్ మహతో కూడా వేదికపై ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జార్ఖండ్‌లోని 81 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13న తొలి దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 20న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం జార్ఖండ్‌లో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని నిర్ణయించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..