Karnataka Elections 2023: దేవెగౌడ కుటుంబంలో తారస్థాయికి ఆధిపత్య పోరు.. సంక్షోభంలో JD(S)

పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు ఎలా ఉన్నా.. పాతికేళ్ల ప్రస్థానం కూడా లేని ఈ పార్టీ ఇప్పుడు ఉనికి చాటుకోడానికే అపసోపాలు పడాల్సిన స్థితికి చేరుకుంది.

Karnataka Elections 2023: దేవెగౌడ కుటుంబంలో తారస్థాయికి ఆధిపత్య పోరు.. సంక్షోభంలో JD(S)
Devegowda FamilyImage Credit source: TV9 Telugu
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 06, 2023 | 10:53 AM

ప్రాంతీయ పార్టీలంటే దాదాపు కుటుంబ పార్టీలే. వాటికి కుటుంబమే బలం. ఒక్కోసారి అదే బలహీనతగా కూడా మారుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటకలో జనతాదళ్ (సెక్యులర్) పరిస్థితి ఇలాగే ఉంది. భారతదేశానికి ప్రధాన మంత్రిగా పనిచేసిన దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలిసి 1999లో జనతాదళ్ (సెక్యులర్) ఏర్పాటు చేశారు. నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జే.హెచ్. పటేల్ భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కు మద్ధతివ్వడంతో జనతాదళ్‌లో చీలిక ఏర్పడింది. పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు ఎలా ఉన్నా.. పాతికేళ్ల ప్రస్థానం కూడా లేని ఈ పార్టీ ఇప్పుడు ఉనికి చాటుకోడానికే అపసోపాలు పడాల్సిన స్థితికి చేరుకుంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 2004లో 58 సీట్లు గెలుచుకుని, కాంగ్రెస్‌తో కలిసి రాష్ట్రంలోనే మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీ(ఎస్) ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ 40 స్థానాలు దాటలేకపోయింది.

2005లో సిద్ధరామయ్యను బహిష్కరించడంతో పార్టీలో దేవెగౌడ కుటుంబం పెత్తనం మరింత పెరిగింది. అయితే దేవెగౌడ వారసత్వాన్ని ఒక్కరే పంచుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ ఆయన కుమారులిద్దరూ రాజకీయ వారసత్వం కోసం పోటీపడడంతో పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. అది చివరకు అంతర్యుద్ధానికి దారితీసింది. ఫలితంగా పార్టీలో కుటుంబ సభ్యులు తప్ప చెప్పుకోదగ్గ నేతలెవరూ కనిపించడం లేదు. పార్టీ కోసం కష్టపడితే పదవులు దక్కుతాయన్న నమ్మకం ఇతర నేతల్లో సన్నగిల్లింది. ఫలితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ బీజేపీ లేదా కాంగ్రెస్‌లోకి జారుకుంటున్నారు. ఫలితంగా పార్టీ అస్థిత్వ సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది.

వారసులపై కొరవడిన పెత్తనం

ఇవి కూడా చదవండి

చాలా ప్రాంతీయపార్టీల్లో ఉన్న సమస్యే దేవెగౌడ పార్టీలోనూ ఉంది. కాకపోతే ఆయన కొడుకులిద్దరూ రాజకీయాల్లో చురుకైనవారు కావడమే తలనొప్పిగా మారింది. కుటుంబంలో వారసులిద్దరి మధ్య ఆధిపత్య పోరును కట్టడి చేయడానికి దేవెగౌడకు ఇదివరకటిలా వయస్సు, ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో ఆధిపత్య పోరు కాస్తా అంతర్యుద్ధంగా మారింది. దేవెగౌడ కుమారులు కుమారస్వామి, రేవణ్ణ మధ్య విబేధాలు, మనస్ఫర్థలు, ఆధిపత్య పోరు కొత్తగా ఏర్పడినవేమీ కాదు. కాకపోతే దేవెగౌడ ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఆయన ఇద్దరికీ సర్దిచెబుతూ, సరిదిద్దుతూ వచ్చారు. అంతిమంగా పార్టీ ప్రయోజనాల కోసం తద్వారా సమకూరే కుటుంబ ప్రయోజనాల కోసం అందరూ కలసి పనిచేస్తూ వచ్చారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో అప్పటికే ముఖ్యమంత్రి పదవిలో కుమారస్వామి, ఎమ్మెల్యేగా ఆయన భార్య అనిత ఉండగా.. వారి కుమారుడు నిఖిల్‌ను మాండ్య నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని పట్టుబట్టారు. ఈ చర్య రేవణ్ణకు ఆగ్రహాన్ని తెప్పించింది. కుమారస్వామి కుటుంబం మొత్తం పదవులు అనుభవించాలన్న అత్యాశను, విపరీత స్వార్థాన్ని ప్రదర్శించడాన్ని రేవణ్ణ తీవ్రంగా తప్పుబట్టారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడమే కాదు, ఒకరకంగా చెప్పాలంటే దెబ్బతీయాలని చూస్తున్నారని రేవణ్ణ ఆరోపించారు. అంతటితో సరిపెట్టలేదు.. తన తండ్రి దేవెగౌడ కూడా పక్షపాతాన్ని ప్రదర్శిస్తూ కుమారస్వామి కుటుంబానికే వత్తాసు పలుకుతున్నారని బహిరంగ విమర్శలు చేశారు.

ఈ పరిస్థితుల్లో కొడుకులిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం కోసం దేవెగౌడ తన కంచుకోట లాంటి ‘హసన్’ నియోజకవర్గాన్ని రేవణ్ణ పెద్ద కుమారుడు ప్రజ్వల్‌ కోసం త్యాగం చేశారు. తనకు అంతగా పట్టులేని ‘తుమకూరు’ నియోజకవర్గాన్ని ఎంచుకుని పోటీ చేశారు. కానీ ఈ నిర్ణయం ఎంతటి తప్పిదమో ఫలితాలను చూశాక తెలిసొచ్చింది. ఇటు దేవెగౌడ, అటు నిఖిల్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలవగా.. పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక లోక్‌సభ సభ్యుడిగా ప్రజ్వల్ ఒక్కడే మిగిలాడు.

అంతర్యుద్ధంగా మారిన ఆధిపత్య పోరు

దేవెగౌడ వారసులు కుమార స్వామి, రేవణ్ణ మధ్య, వారి కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కాస్తా అంతర్యుద్ధంగా మారడానికి రేవణ్ణ భార్య భవాని నిప్పు రాజేశారు. కొద్ది రోజుల క్రితం జేడీ(ఎస్) కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ‘హాసన్’ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి పోటీకి పార్టీ ఆల్రెడీ ఒక అభ్యర్థిని గుర్తించిందని చెబుతూ భవాని పోటీ చేయకుండా పావులు కదుపుతున్నారు. కానీ ఇది కేవలం ఆధిపత్య పోరు మాత్రమే కాదు. దీన్ని తోడికోడళ్ల పోరుగా కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుక్కారణం కుమారస్వామి అనిత ఎమ్మెల్యేగా ఉండడమే. చిన్న కోడలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తానెందుకు ఉండకూడదన్న పట్టుదల భవానీలో ఉందని తెలుస్తోంది. ఈ డిమాండ్‌ను ఆమె ఇద్దరు కొడుకులు కూడా బలంగా సమర్థించడంతో కుటుంబంలో కొత్త చిచ్చు రగులుకుంది. ఈ సమస్యను తాత దేవెగౌడ పరిష్కరిస్తారని వారిద్దరూ చెబుతున్నారు. 2019లోనే ఇద్దరు కొడుకుల కుటుంబాల మధ్య పోరును పరిష్కరించే క్రమంలో తన సీటు త్యాగం చేసి ఎదురుదెబ్బ తిన్న దేవెగౌడ, ఇప్పుడు ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

భవానీ ప్రయత్నాలను కుమారస్వామి అడ్డుకోవడం వెనుక మరో కారణం లేకపోలేదు. ఈసారి కూడా తమకు పట్టున్న ప్రాంతాల్లో గెలుపొంది, ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో గతంలో మాదిరిగానే ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవాలని కలలుగంటున్న కుమారస్వామి.. పార్టీ మొత్తం కుటుంబ సభ్యులతో నిండిపోతే మరింత నష్టపోతామని భయపడుతున్నారు. ఇప్పటికే కుటుంబానికి చెందిన ఆరుగురు వివిధ పదవుల్లో ఉన్నారు. పెద్ద దిక్కు దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ఉండగా.. ఆయన కొడుకులు రేవణ్ణ, కుమారస్వామి, చిన్న కోడలు అనిత కుమారస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. రేవణ్ణ కొడుకుల్లో ప్రజ్వల్ లోక్‌సభ సభ్యుడిగా, సూరజ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని ఇప్పుడు అసెంబ్లీకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో నిఖిల్‌ను రామనగర నుండి అభ్యర్థిగా ప్రకటించి, తాను చన్నపట్నకు మారాలని యోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ‘పడవ’లో కుటుంబ ‘బరువు’ మరింత పెరిగితే మునిగిపోవాల్సి వస్తుందని కుమారస్వామి ఆందోళన చెందుతున్నారు. అందుకే తన వదిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడాన్ని కుమారస్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తిరోగమనంలో రాజకీయ ప్రస్థానం

జనతాదళ్‌లో చీలిక కారణంగా ఆవిర్భవించిన జేడీ(ఎస్) తన పునాదులను బలంగా నిర్మించి, పార్టీని రాష్ట్రమంతటా విస్తరించడంలో విఫలమైంది. పొరుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి చెంది, బలంగా పాతుకుపోయాయి. తమిళనాట ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలను జాతీయపార్టీలేవీ ఎదుర్కోలేకపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ పోరు ప్రధానంగా ప్రాంతీయ పార్టీలైన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం మధ్యనే ఉంది. తెలంగాణలో ఉద్యమపార్టీగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చి, దాన్ని సుస్థిరం చేసుకుని ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చి జాతీయ పార్టీగా విస్తరించేందుకు సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు రెండూ జేడీ(ఎస్) తర్వాత ఆవిర్భావం తర్వాత జన్మించినవే. కానీ దాదాపు పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో జేడీ(ఎస్) ఏమాత్రం బలపడకపోగా, నానాటికీ బలహీనపడుతూ వస్తోంది.

పార్టీ ఆవిర్భించిన తొలినాళ్లలో సమాజంలోని అనేకవర్గాల మద్ధతు లభించింది. దేవెగౌడ సామాజికవర్గం వొక్కలిగలతో పాటు ఇతరవర్గాల వారు సైతం ఆదరించారు. ఆయనతో పాటు పార్టీ ఆవిర్భావంలో భాగమున్న సిద్ధరామయ్యతో ఆయన సామాజికవర్గం కురుబతో పాటు మైనార్టీలు, ఇతర వెనుకబడినవర్గాలు వెంటనిలిచాయి. అదే సమయంలో అహింద పేరుతో అల్పసంఖ్యాక వర్గాలు (ముస్లింలు), వెనుకబడిన వర్గాలు (ఓబీసీలు), దళితుల మద్ధతును సిద్ధరామయ్య పోగేశారు. ఇద్దరూ కలసికట్టుగా పనిచేసి ఉంటే ఈపాటికి రాష్ట్రంలో తిరుగులేని బలమైన ప్రాంతీయ పార్టీగా జేడీ(ఎస్) అవతరించి ఉండేది. కాకపోతే సిద్ధరామయ్యను దేవెగౌడ పార్టీ నుంచి బహిష్కరించడంతో జేడీ(ఎస్) బలహీనపడడం మొదలైంది. సిద్ధరామయ్య కాంగ్రెస్‌లో చేరడంతో అప్పటి వరకు జేడీ(ఎస్) వెంటనడిచిన కురుబ, మైనార్టీ వర్గాలు దూరమయ్యాయి. సిద్ధరామయ్యను దూరం చేశాక పార్టీలో కుటుంబ పెత్తనం పెరిగింది. అప్పటి నుంచి జేడీ(ఎస్) అంటే ‘వొక్కలిగ’ సామాజికవర్గానికి ప్రతినిధిగా, ఒక కుల పార్టీగా పరిమితమైంది.

అదృష్టం కలిసొచ్చి, తక్కువ సీట్లే గెలిచినప్పటికీ కుమారస్వామికి 2006లో ఒకసారి, 2018లో మరోసారి ముఖ్యమంత్రి పదవీయోగం వరించింది. ఈ పదవీకాలాన్ని పార్టీ విస్తరణకు ఉపయోగించి ఉంటే, కేవలం దక్షిణ కర్ణాటకలో కొన్ని జిల్లాలకే పరిమితమైన పార్టీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి ఆస్కారం ఉండేది. కానీ అదీ జరగలేదు. పైపెచ్చు సీఎం పదవిలో ఉండగా దాదాపు డజను మంత్రిత్వశాఖలను తన వద్దే ఉంచుకున్నారు తప్ప, అధికారాన్ని పంచుకోడానికి కుమారస్వామి ఇష్టపడలేదు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో ఆ పార్టీ తన కార్యకర్తలు, నేతలకు వివిధ కార్పొరేషన్లు, బోర్డుల పదవులను, నామినేటెడ్ పోస్టులను ఇచ్చి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటే, కుమారస్వామి కార్యకర్తలకు చేసిందేమీ లేదు. దీంతో పార్టీలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా దాదాపు కుటుంబేతర నేతలందరూ నైరాశ్యంలో మునిగిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతలు ఒక్కొక్కరుగా తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ బీజేపీ లేదా కాంగ్రెస్‌లోకి మారుతున్నారు. తీరా ఎన్నికలు సమీపించే సమయానికి పార్టీ వివిధ నియోజకవర్గాల్లో గెలుపొందే సామర్థ్యం గల అభ్యర్థులను గుర్తించలేకపోతోంది.

ఓటుబ్యాంకులో చీలిక

కర్ణాటకలో పాత మైసూరు ప్రాంతంగా పిలిచే కొన్ని జిల్లాల్లో మాత్రమే జేడీ(ఎస్) పట్టు కలిగి ఉంది. 2018లో జేడీ(ఎస్) గెలుపొందిన 37 లో 30 సీట్లను ఈ ప్రాంతం నుంచే గెలుచుకుంది. ఈ ప్రాంతంలో జన సంఖ్య ఎక్కువగా ఉన్న వొక్కలిగలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. వారంతా జేడీ(ఎస్)ను తమ సొంత పార్టీగా భావిస్తూ ఆదరించడం వల్లనే ఇన్నాళ్లుగా ఇక్కడ తిరుగులేని పార్టీగా జేడీ(ఎస్) మనుగడ సాగిస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ‘వొక్కలిగ’ వర్గానికి చెందిన డీకే శివకుమార్‌ను కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో ఈ వర్గం ఓట్లలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే తమ కంచుకోటలో జరిగిన ఉపఎన్నికల్లో కేఆర్ పేట, సిరా నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపొంది పాగా వేసింది.

మరోవైపు వొక్కలిగలతో పాటు జేడీ(ఎస్) వెంట నిలిచిన మైనారిటీలూ దూరమవుతున్నారు. జమీర్ అహ్మద్ ఖాన్, ఇక్బాల్ అన్సారీ, అబ్దుల్ అజీమ్ వంటి బలమైన మైనార్టీ నాయకులు పార్టీని వీడడంతో ఆ ఓటుబ్యాంకులోనూ చీలిక కనిపిస్తోంది. మైనారిటీల్లో అత్యధిక భాగంగా కాంగ్రెస్ వెంట నడుస్తున్నారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” అంటూ బీజేపీ సైతం కొందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!
ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.