AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల ప్రచారంలో మాస్క్‌లు తప్పనిసరి! కేంద్రం, ఈసీకి హైకోర్టు నోటీసులు

ఎన్నికల ప్రచార సభలు కోవిడ్ హాట్‌స్పాట్‌లుగా మారాయి. అభ్యర్థులు, ప్రచారకులు మాస్క్‌లు ధరించకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసీ జారీ చేసిన కోవిడ్ 19 మార్గదర్శకాలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో మాస్క్‌లు తప్పనిసరి! కేంద్రం, ఈసీకి హైకోర్టు నోటీసులు
ప్రతీకాత్మక చిత్రం
Janardhan Veluru
|

Updated on: Apr 08, 2021 | 4:28 PM

Share

ఎన్నికల ప్రచార సభలు కోవిడ్ హాట్‌స్పాట్‌లుగా మారాయి. అభ్యర్థులు, ప్రచారకులు మాస్క్‌లు ధరించకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసీ జారీ చేసిన కోవిడ్ 19 మార్గదర్శకాలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా ఆదేశాలివ్వాలంటూ దిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై తమ వైఖరి తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వారు మాస్క్‌లు ధరించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభలతో వైరస్ వేగంగా విస్తరించే ముప్పు ఉన్నట్లు తన పిటిషన్‌లో ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశాలివ్వాలని కోరారు. ఈ విషయంలో ఈసీ జారీ చేసిన కోవిడ్-19 నివారణ మార్గదర్శకాలను కొందరు అభ్యర్థులు, ఎన్నికల ప్రచారకులు పదేపదే ఉల్లంఘిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా డీబార్ చేయాలని కోర్టుకు విన్నవించారు.

చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. విక్రమ్ సింగ్ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది విరాగ్ గుప్తా…ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా ఎన్నికల సంఘం డిజిటల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వారికి మాస్క్‌లు తప్పనిసరి ఎందుకు చేయడంలేదో విస్మయం కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

సామాన్యులకు జరిమానాలు…నేతలపై చర్యలేవీ? మాస్క్‌లు ధరించనందుకు అమాయక ప్రజల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ జరిమానాలు విధిస్తున్నారని గుర్తుచేశారు. అయితే ఎన్నికల ప్రచార సభల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న రాజకీయ నాయకులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అభ్యంతరం తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఈసీ వైఖరిని తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు…తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదావేసింది.

ఇవి కూడా చదవండి…రెండో దశలో రెచ్చిపోతున్న కరోనా.. ఓవైపు వైరస్.. ఇంకోవైపు వ్యాక్సిన్ కొరత

మొదటి దానికి భిన్నంగా కరోనా సెకండ్ వేవ్ లో కొత్త లక్షణాలు.. అధికంగా వైరల్ లోడ్.. మాస్కులు ధరించక పోతే ముప్పే…

Follow Us