BJP Manifesto Focus: బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లో మెరపుల్లాంటి హామీలు.. గెలుపుపై ప్రధాన ఫోకస్..
బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లో చాలా చాలా చిత్రాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు, బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇస్తున్న హామీలు చూస్తుంటే అందులో కొన్ని విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉన్నాయి.
బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లో చాలా చాలా చిత్రాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు, బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇస్తున్న హామీలు చూస్తుంటే అందులో కొన్ని విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉన్నాయి. మరికొన్ని సాధ్యమా అనిపించేలా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇకముందు రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి మెరపుల్లాంటి హామీలు ఇస్తుందన్నదే అసలుపాయింట్.
ఎన్నికల్లో గెలవడానికి సెంటిమెంట్‌ను రాజేసి, ఓట్ల దండుకుంటుందని బీజేపీ మీద ప్రత్యర్థి పార్టీలు చేసే ఆరోపణ. ఇప్పుడు తమిళనాడు, బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా- బీజేపీ హామీలపై ఫోకస్ పెరుగుతోంది. వీటిలో కొన్ని హామీలు చర్చనీయాంశం అవుతున్నాయి.
తమిళనాడు సీట్లపై కర్చీఫ్ వేయాలనుకుంటున్న కాషాయసైన్యం.. జల్లికట్టు మీద మనసు పారేసుకుంది. జల్లికట్టును నిషేధించాలంటూ ఒక రేంజ్‌లో డిమాండ్లు వస్తున్నాయి. ఒకదశలో జల్లికట్టును నిషేధించాలని న్యాయస్థానాలు కూడా ఆదేశించాయి. కానీ సంప్రదాయ క్రీడ అనే పేరుతో జల్లికట్టును కొనసాగించాలనే డిమాండ్లు వచ్చాయి.
అందుకే జల్లి కట్టు.. ఓట్లు పట్టు అనుకుందేమోగానీ.. ద్రవిడ పార్టీలు చిన్నబోయేలా పెద్ద హామీ ఇచ్చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కిందకు జల్లికట్టును తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అంటే జల్లికట్టు ఆటగాళ్లకు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు లభిస్తాయన్నమాట. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సంప్రదాయ తమిళ క్రీడలను ప్రవేశపెడతామని బీజేపీ ఇచ్చిన వాగ్దానం.
అలాగే దేశంలో రోడ్డు ప్రమాదాలు తీవ్రత పెరుగుతోంది. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల్లో భారత్‌లో 11 శాతం నమోదు అవుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ కఠినం అవుతున్నవేళ, బీజేపీ మాత్రం ఫ్రీ లైసెన్స్ పాట పాడుతోంది. 18 నుంచి 23 ఏళ్ల అమ్మాయిలకు ఫ్రీ టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామని ప్రకటించారు. ఇక తమిళనాడుని మేనిఫ్యార్చరింగ్ స్టేట్ అంటుంటాం. అలాంటి తమిళనాడుకు బీజేపీ ఒక విచిత్రమైన హామీ ఇచ్చింది.
తమిళనాడును దక్షిణభారతంలోనే నెంబర్‌వన్ చేస్తామని ప్రటించారు. నెంబర్‌వన్ చేస్తామంటే దేశంలో అని చెప్పాలిగానీ, సౌతిండియాలో అని చెప్పడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో దర్శనం టికెట్లు రద్దు చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. తమిళనాడులో శాసనమండలిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది.
ఇక బెంగాల్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కొన్ని సిత్రాలు కనిపిస్తున్నాయి. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ బీజేపీ చేసిన ప్రకటన చర్చనీయాంశం అయింది. అభివృద్ధిని పక్కనబెట్టి- జనాన్ని సంతృప్తి పరిచే హామీలు మాత్రమే ఇస్తున్నారని బీజేపీ నేతలు ఇతర పార్టీలను విమర్శిస్తుంటారు. అలాంటి బీజేపీ మాత్రం ఆకర్షణీయమైన, విచిత్రమైన హామీలు ఇస్తోంది.
రానున్న సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు, ఇతర అసెంబ్లీలు, ఇలాగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇవ్వబోయే హామీలు ఎలా ఉండబోతున్నాయన్న పాయింట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.