Assembly Elections: బెంగాల్,కేరళలో నువ్వా..నేనా.. తమిళనాడు, అస్సాంలో ఓటరు దేవుడు మెచ్చేది ఎవరినో..! పోలింగ్ డే..!
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో మంగళవారం మూడో ఫేజ్ పోలింగ్ జరగనుంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు పూర్తవుతుండగా.. బెంగాల్, అసోంలో మాత్రం 3వ విడత ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.
Assembly Elections: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో మంగళవారం మూడో ఫేజ్ పోలింగ్ జరగనుంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు పూర్తవుతుండగా.. బెంగాల్, అసోంలో మాత్రం 3వ విడత ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. కొవిడ్ నేపథ్యంలో భారీగా పోలింగ్ కేంద్రాలతో పాటు.. శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేసేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, అసోంలలో మంగళవారం ఎన్నికల పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భారీగా భద్రతా బలగాలను మోహరించింది. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ఓటర్లు సురక్షితంగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు చేసింది.
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా.. బెంగాల్, అసోంలో మాత్రం మూడో విడత ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు తమిళనాడులోని కన్యాకుమారి, కేరళలోని మలప్పురం లోక్‌సభ నియోజకవర్గాలకూ పోలింగ్ మంగళవారం జరగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగే ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తంచేయనున్నారు.
తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తంగా ఆరున్నర కోట్లకు పైగా ఓటర్లు ఉండగా.. 88,937 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్ బూత్ చొప్పున ఏర్పాటు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు లక్షా 58వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య నువ్వానేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరులో కమల్‌హాసన్, దినకరన్ నేతృత్వంలోని కూటములు ఎంత మేర ప్రభావం చూపుతోందోనన్న ఆసక్తి నెలకొంది.
కేరళలో 140 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 957మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌తో పాటు బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. మొత్తంగా రెండు కోట్ల 74 లక్షల 46 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 1980ల నుంచి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములను.. ప్రత్యామ్నాయంగా ఎన్నుకుంటూ వస్తున్న ఓటర్లు… ఏ ఒక్క కూటమికీ వరుసగా అధికారం ఇవ్వలేదు. ఈసారి ఏ కూటమి వైపు మొగ్గుచూపుతారోననే అంశం ఉత్కంఠగా మారింది. ఇకపోతే, కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ మొత్తంగా పది లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
బెంగాల్‌లో 31 స్థానాల్లో మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో 205 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు 618 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. ఎన్నికల కోసం అధికారులు 10,871 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూడో దశ ఎన్నికల్లో 78.5లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోనే 16 నియోజకవర్గాలు ఉండగా.. హుగ్లీలో ఎనిమిది, హావ్‌డాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2016లో 31 స్థానాల్లో 30 స్థానాలు టీఎంసీ గెలుచుకోగా.. హావ్‌డాలోని అమ్టా నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ గెలిచింది.
ఇక… అస్సాంలో ఆఖరి దశ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. మూడో దశలో ఇక్కడ 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా.. మూడో దశలో 79 లక్షల 19,641 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక… ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అధికార, విపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లపై హామీలు గుప్పించాయి.