AP Crime News: నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రియుడు మరణించిన విషయం తెలుసుకున్న ఓ ప్రియురాలు ఆత్మహత్యం చేసుకుంది. రెండేళ్లుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడానికి పెద్దలను కూడా ఒప్పించారు. కానీ విధి ఆడిన ఆటలో ఈ ప్రేమజంట విఫలమయ్యారు. ఉండ్రాళ్ల మండలంలోని యల్లాయపాళెం మజరా గ్రామనత్తంలో జరిగిన ఈ ఘటన గ్రామస్థులందరిని కంటతడి పెట్టిస్తుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామంలోని దళితవాడకు చెందిన ఉండ్రాళ్ల శ్రీకాంత్, అదే ప్రాంతానికి చెందిన కోరికల సౌమ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. అయితే శ్రీకాంత్‌కి ఒక అన్న, తమ్ముడు ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహం చేశాక వీరికి పెళ్లి చేద్దామని కుటుంబ సభ్యులు, పెద్దలు నిర్ణయించారు. ఇంతలోనే పెను విషాదం జరిగింది.
శ్రీకాంత్ ఎలక్ట్రికల్ డెకరేటర్స్ వద్ద పనిచేస్తాడు. అందులో భాగంగా ఆత్మకూరు వద్ద డెకరేషన్స్ పని నిమిత్తం శుక్రవారం వెళ్లి విద్యుత్ షాకకు గురై మృతి చెందాడు. దీంతో మనస్తాపానికి గురైన సౌమ్య శనివారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న గుళికల మందు తీసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు నార్తురాజుపాళెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు .
దీంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇద్దరి మృతదేహాలకు గ్రామంలో ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు. ప్రేమజంట మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. పెళ్లి కావాల్సిన పిల్లలు చనిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. అయితే వీరి మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.