సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలు ముంబై, ఢిల్లీ, లండన్ వరకూ పాకిపోయాయి. అపోగేర్ మాన్యుఫాక్చరర్ పేరిట 10కోట్ల మేర.. అమితాబ్ బంధువును చీటింగ్ చేశాడు శ్రీధర్ రావు.
అమితాబ్ వియ్యంకుడి తమ్ముడు అనిల్ నందా.. చేసిన కంప్లయింట్ తో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. నందాకు ఢిల్లీలోని ఫ్రెంచ్ కాలనీలోని స్థలం అమ్ముతానని నమ్మబలికాడు శ్రీధర్ రావు. ఈ స్థలానికి సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించాడు. ఈ ఆస్తిని కొనడంలో భాగంగా.. అనిల్ నందా.. శ్రీధర్ రావుకు పది కోట్ల రూపాయల వరకూ ఇచ్చాడు. ఈ డబ్బు తీసుకుని ఆస్తి పత్రాలను చెక్ చేసుకుంటే.. మొత్తం మోసమని బయట పడింది.
దీంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు నందా. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏయే ఖాతాల్లోకి డబ్బు పంపారన్న వివరాలందుకున్న ఢిల్లీ పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. రంజిత్ హుడా అనే మరో చీటర్ తో కలసి శ్రీధర్ రావు.. ఇలాంటి అడ్డగోలు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. రంజిత్ హుడాను ఏ1గా, శ్రీధర్ రావును ఏ2గా.. కేసు నమోదు చేశారు. ఈ దిశగా రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు.
అంతే కాదు.. విచారణకు హాజరు కావల్సిందిగా.. శ్రీధర్ రావుకు పోయిన నెల జనవరిలో నోటీసులు జారీ చేశారు. అయినా సరే అతడి నుంచి స్పందన లేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి.. నిన్న సాయంత్రం.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో శ్రీధర్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ తరలించి అక్కడ విచారణ చేస్తున్నారు.