Prakasam District: రిటైర్మెంట్‌కు ముందు బకాసురుడిగా మారిన తహశీల్దార్.. ఏకంగా 378 ఎకరాల ప్రభుత్వ భూములు ఆన్లైన్

పదవీ కాలం మొత్తం గడిచిపోయింది. ఇక రేపో, మాపో రిటైర్‌మెంట్. ఈలోపు అధికార దుర్వినియోగం. అయితే పదవీ విరమణ అనంతరం ఇంట్లో కూర్చుంటే.. చేసిన పాపాలు పోతాయా? పోలీసులు అరెస్ట్ చేశారు.

Prakasam District: రిటైర్మెంట్‌కు ముందు బకాసురుడిగా మారిన తహశీల్దార్.. ఏకంగా 378 ఎకరాల ప్రభుత్వ భూములు ఆన్లైన్
Illegal Mutation
Follow us

|

Updated on: Sep 13, 2021 | 7:12 AM

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ప్రభుత్వ భూములు పరిస్థితి కంచె చేను మేస్తోంది అన్న చందంగా తయారైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి అర్హత లేని వ్యక్తులకు పాసుపుస్తకాలు మ్యుటేషన్ చేసిన విశ్రాంత తహశీల్దార్ పల్లె పోగు విద్యాసాగరుడును ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాసాగరుడు మార్కాపురం మండలంలో 9 నెలలు తహాశీల్దార్‌గా పనిచేశారు. జూన్ 30న పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే ఇదే అదనుగా భావించి మండలంలోని వీఆర్వోలు, ఆర్.ఐ, కంప్యూటర్ ఆపరేటర్ అందరూ ఏకమయ్యారు. వారందరికీ అధికార పార్టీ నాయకులు తోడయ్యారు. పదవి విరమణ పొందే 20 రోజుల వ్యవధిలో 378.69 ఎకరాలు ప్రభుత్వ భూములను ఆన్లైన్ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విచారణలో నిజమని తేలింది.

దీంతో ఇప్పటికే ఒక ఆర్ఎస్ఐ, ఒక విలేజ్ సర్వేయర్, 13 మంది సిబ్బందిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. స్వలాభం కోసం అక్రమాలకు పాల్పడ్డ తహశీల్దార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు విద్యాసాగరుడుపై ఐపిసి 409, 467, 477(A) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒంగోలులో ఉన్న ముద్దాయి విద్యాసాగరుడు అదుపులోకి తీసుకొని మార్కాపురం తీసుకొచ్చారు. భూముల పరాధీనంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై విచారణ కొసాగిస్తున్నారు ఉన్నతాధికారులు. చూశారుగా తప్పు చేస్తే.. ఎప్పటికైనా శిక్ష పడక మానదు. అర్హుడైన లబ్ధిదారులు వెళ్లి ఏదైనా పని చేసిపెట్టమంటే.. రేపు రా.. మాపు రా అని తిప్పే కొందరు రెవిన్యూ ఉద్యోగులు.. కాసు వస్తుందంటే మాత్రం క్షణాల్లో పని పూర్తి చేస్తారు. ఏది ఏమైనా రెవిన్యూ వ్యవస్థలో ప్రక్షాళన అత్యంత అవసరం.

Also Read: రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్

ఆటో కిరాయి కోసం గొడవ.. పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్.. ఎక్కడ జరిగిందంటే..