AP Crime News: బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య.. కర్రతో తలపై కొట్టి నగలు చోరీ
AP Crime News: విజయవాడ నగర శివారు కుందావారి కండ్రిగ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగారం కోసం ఒంటరిగా
AP Crime News: విజయవాడ నగర శివారు కుందావారి కండ్రిగ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగారం కోసం ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి హతమార్చారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బమ్మ అనే వృద్ధురాలు స్థానిక సిండికేట్ బ్యాంకు సమీపంలో ఉంటుంది. భర్త, పెద్ద కుమారుడు చనిపోవడంతో చిన్న కుమారుడు వెంకటరెడ్డి, ఇతర బంధువులు మరో వీధిలో ఉంటున్నారు. అయితే తను ఒంటరిగా ఇంట్లో ఉంటూ పక్క గదిని వేరేవారికి అద్దెకు ఇచ్చింది. గురువారం సాయంత్రం అద్దెకు ఉంటున్న వారు బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.
ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి సుబ్బమ్మ మెడలోని సుమారు 5 తులాల బంగారు గొలుసు దోచుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె ప్రతిఘటించడంతో తలపైన, ఇతర శరీర భాగాలపై కర్రతో, రాడ్డుతో బలంగా కొట్టడంతో మంచంపై పడిపోయింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో అద్దెకు ఉంటున్న వారు తిరిగి రాగా.. రక్తపు మడుగులో వృద్ధురాలిని గుర్తించారు. బంధువుల సాయంతో కొనఊపిరితో ఉన్న ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
ఘటనాస్థలాన్ని ఏడీసీపీ లక్ష్మీపతి, నార్త్ డివిజన్ ఏసీపీ షేక్ షాను పరిశీలించారు. సీసీఎస్, వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నున్న సీఐ హనీష్‌బాబు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు, రోకలిబండను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. కాగా కుటుంబ సభ్యులు సుబ్బమ్మకు ఎవరితో విభేదాలు లేవని తెలిపారు. నిందితుడిని పట్టుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.