Verdict: మరణించే ముందు నిజమే మాట్లాడతారు..మృతుడి వాంగ్మూలం ఆధారంగా నిందితులకు యావజ్జీవ శిక్ష వేసిన కోర్టు!
Verdict: చావు అంచున ఉన్న వ్యక్తి అబద్ధం చెప్పడు అని అంటారు. చనిపోయే ముందు కచ్చితంగా నిజమే చెబుతారని అందరూ నమ్ముతారు. చట్టం కూడా మరణ వాంగ్మూలాన్ని నమ్ముతుంది
Verdict: చావు అంచున ఉన్న వ్యక్తి అబద్ధం చెప్పడు అని అంటారు. చనిపోయే ముందు కచ్చితంగా నిజమే చెబుతారని అందరూ నమ్ముతారు. చట్టం కూడా మరణ వాంగ్మూలాన్ని నమ్ముతుంది. మరణించే మనిషి అబద్ధం చెప్పే అవకాశం లేదని భావిస్తుంది. అందుకే ఏదైనా అనుమానాస్పద పరిస్థితిలో మనిషి మరణిస్తాడని భావిస్తే అతని మరణ వాంగ్మూలం మేజిస్ట్రేట్ సమక్షంలో తీసుకుంటారు. ఇదిగో అటువంటి మరణ సమయంలో ఒక వ్యక్తి ఇచ్చిన స్టేట్ మెంట్ హంతకులకు శిక్ష పడేలా చేసింది. ముంబాయిలో ఈ ఘటన జరిగింది. కేసు.. తీర్పు వివరాలు ఇలా ఉన్నాయి.
ఇదీ కేసు..
అది 2015. ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయతనం చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. వెంటనే, స్పాట్ కు చేరుకున్న పోలీసులు కాలిన గాయాలతో ఉన్న తస్బీరున్నిసా ఖాన్ ను ఆసుపత్రిలో చేర్పించారు. తరువాత కేసు పై విచారణ మొదలు పెట్టారు. విచారణ సమయంలో బాధితుడు ఇక్బాల్ ఖాన్ సోదరి అన్వర్ ఖాన్ ను వివాహం చేసుకున్నట్టు తెలిసింది. ఈ దంపతులు ఇద్దరూ ఇక్బాల్ ఖాన్ దంపతులు కలిసి ఒకే ఇంటిలో వేర్వేరు భాగాల్లో నివసించేవారు. వారి మధ్య ఆస్తి వివాదాలున్నాయి. ఆ ఇంటిలో కొంత భాగానికి సంబంధించి ఈ రెండు కుటుంబాల మధ్య స్పర్ధలు రేగాయి. ఇదిలా ఉండగా ఒకరోజు వీరి మధ్యలో ఆ ఆస్తి విషయంలో వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపధ్యంలో ఇక్బాల్ (50), అతని భార్య షాహిన్ (40) బాధితుడిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. బయటకు వచ్చి అతను ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడని ఇరుగు పొరుగు వారిని పిలిచారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి కాలిన గాయాలతో ఉన్న బాదితుడ్ని ఆసుపత్రికి చేర్చారు. ఆసుపత్రిలో రెండు రోజుల తరువాత అతను మరణించాడు. మరణించే ముందు పోలీసులు అతని దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వాంగ్మూలంలో మృతుడు తనను తన బావ ఇక్బాల్, అతని భార్య షాహిన్ కలిసి కిరసనాయిల్ పోసి చంపే ప్రయత్నం చేశాడని చెప్పాడు. దీంతో భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తరువాత కోర్టులో కేసు విచారణ సందర్భంగా మృతుడు తస్మీరున్నీసా ఖాన్ కిరోసిన్ తానే పోసుకుని నిప్పంటించు కున్నాడని ఇక్బాల్ దంపతులు చెప్పారు. ఈ కేసులో 13 మంది సాక్షులను కోర్టు విచారించింది. అన్ని అంశాలు పరిశీలించిన బొంబాయి సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో మృతుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావించడం లేదని పేర్కొంది కోర్టు. మృతుడి మరణ వాంగ్మూలాన్ని పరిశీలనలోకి తీసుకున్న కోర్టు మరణించే సమయంలో ఎవరూ అబద్ధం చెప్పరని అభిప్రాయపడింది. ఇక్బాల్ దంపతులే అతనిని హత్య చేశారని నిర్ధారించింది. దీంతో వీరికి ఆస్తి వివాదంపై నిప్పంటించినందుకు జీవిత ఖైదు విధించింది. “ఇంటిలో కొంత భాగానికి సంబంధించి కుటుంబం మధ్య ఉన్న వివాదం కారణంగా మరణించిన వ్యక్తి తన తప్పు లేకుండా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి (ముగ్గురు) చిన్న పిల్లలు కూడా ఉన్నారు ”అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.