లష్కరే ఉగ్రవాది అరెస్ట్.. గ్రేనేడ్లు, బుల్లెట్లు స్వాధీనం..
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. నిత్యం కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు ఉగ్రవాదులతో పాటు.. సానుభూతిపరులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా..
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. నిత్యం కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు ఉగ్రవాదులతో పాటు.. సానుభూతిపరులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా బందిపొరా జిల్లాలోని హాజిన్ పట్టణం హక్బారా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. జమ్ముకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, 45 బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన రఫీఖ్ అహ్మద్ అనే ఓ ఉగ్రవాది భద్రతా బలగాలపై గ్రేనేడ్ విసరబోయాడు. ఇది గమనించిన జవాన్లు.. వెంటనే అప్రమత్తమై.. అతడిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఆ ఉగ్రవాదిని తనిఖీ చేయగా.. అతడి వద్ద రెండు లైవ్ హ్యాండ్ గ్రేనేడ్లు, 19 రౌండ్ల బుల్లెట్లు (ఏకే-47కు చెందినవి) గుర్తించారు. ఇతడు ఇటీవలే లష్కరే సంస్థలో చేరినట్లు విచారణలో తేలింది. అయితే అతడికి గ్రేనేడ్లు ఇచ్చి.. సైన్యంపై విసరమని ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ టెర్రరిస్టులు టార్గెట్ ఇచ్చారని తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న హజీన్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పట్టుబడ్డ ఉగ్రవాదిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గ్రేనేడ్లు, బుల్లెట్లను సీజ్ చేశారు.