Mysore Gang Rape: రెచ్చిపోయిన మానవ మృగాలు.. స్నేహితుడిని చితకబాది, విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
మానవ మృగాలు రెచ్చిపోయాయి.. కన్నుమిన్ను కానక, సరదాగా గడపాలని వచ్చిన జంటపై పైశాచికంగా విరుచుకుపడ్డాయి. మిత్రుడిని దారుణంగా కొట్టి యువతిని తోడేళ్లలా వెంటాడాయి.
Mysore Gang Rape: మానవ మృగాలు రెచ్చిపోయాయి.. కన్నుమిన్ను కానక, సరదాగా గడపాలని వచ్చిన జంటపై పైశాచికంగా విరుచుకుపడ్డాయి. మిత్రుడిని దారుణంగా కొట్టి యువతిని తోడేళ్లలా వెంటాడాయి. సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి తెగబడ్డాయి. ఈ అత్యంత అమానుష సంఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసింది. మైసూర్‌లోని చాముండిహిల్స్ దగ్గర స్టూడెంట్‌పై గ్యాంగ్‌రేప్ ఘటనలో నిందితులు ఇప్పటికి కూడా పోలీసులకు చిక్కలేదు. మృగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
మైసూర్‌లో స్టూడెంట్‌పై గ్యాంగ్‌రేప్ ఘటనలో ఇప్పటికి కూడా పోలీసులు నిందితులను పట్టుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం మైసూర్‌లోని చాముండిహిల్స్ దగ్గర యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగింది. ఆరుగురు ముష్కరులు అమ్మాయి స్నేహితుడి ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడడం తీవ్ర సంచలనం రేపింది. మృగాళ్ల దాడిలో బాధితురాలితో పాటు ఆమె స్నేహితుడికి కూడా తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో వాళ్లిద్దరికి ట్రీట్‌మెంట్ జరుగుతోంది.
వేర్వేరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి చాముండి హిల్స్ సందర్శనకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని మైసూర్ పోలీసు కమిషనర్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. అయితే, ఆరుగురు నిందితులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కర్ణాటక లో సంచలనం రేపింది. యువతితో పాటు ఆమె ఫ్రెండ్‌ను దారుణంగా హింసించిన వాళ్లను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై.. స్టూడెంట్‌పై అత్యాచార ఘటనపై సీరియస్ అయ్యారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
మరోవైపు, చాముండి హిల్స్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. తాగుబోతులు అక్కడికి వచ్చే వాళ్లను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తునట్టు ఆరోపణలు వచ్చాయి. యువతిపై అత్యాచారం చేసిన తరువాత దుండగులు ఆమె దగ్గర ఉన్న డబ్బుతో పాటు నగలను కూడా లూటీ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు తీరుపై కూడా సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. అయితే ఈ ఘటనపై విపక్షాలు బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేశాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.