Grenade Attack: రాజకీయ నేతలే టార్గెట్‌గా ఉగ్రవాదుల ఘాతుకాలు.. జమ్మూ కశ్మీర్ గ్రెనేడ్ దాడిలో నాలుగేళ్ల చిన్నారి దుర్మరణం
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారతీయ జనతా పార్టీ నేతలే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. మొన్న లాల్‌చౌక్ వద్ద జరిగిన గ్రెనేడ్ దాడి మరువక ముందే మరోసారి దాడికి తెగబడ్డారు.
Grenade Attack in Rrajouri: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారతీయ జనతా పార్టీ నేతలే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. మొన్న లాల్‌చౌక్ వద్ద జరిగిన గ్రెనేడ్ దాడి మరువక ముందే మరోసారి దాడికి తెగబడ్డారు. తాజాగా రాజౌరి జిల్లాలో బీజేపీ నేత ఇంటిపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో నాలుగేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి ఘటన జరిగినట్టు భద్రతా దళాలు తెలిపాయి. కాగా, ఈ దారుణ ఘటనలో బీజేపీ నేత జస్బీర్ సింగ్, ఆయన తల్లిదండ్రులు, మరో ముగ్గురు బంధువులు గాయపడినట్టు తెలిపారు. 36 ఏళ్ల జస్బీర్ సింగ్ టార్గెట్‌గా ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ పేలుళ్ల ధాటికి జస్బీర్ మేనల్లుడు నాలుగేళ్ల బాలుడు ప్రాణాలను కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. దాడి విషయం తెలియగానే భద్రతా బలగాలు హుటాహుటిని ఘటనా స్థలికి చేరుకుని అగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. జస్బీర్ సింగ్‌తో పాటు ఆయన ఐదుగురు కుటుంబ సభ్యులు గాయపడగా, ఇద్దరిని చికిత్స కోసం జమ్మూ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.
ఇదిలావుంటే, అగంతకుల గ్రెనేడ్ దాడిని బీజేపీ నేత తరుణ్ చగ్ ఖండించారు. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులే ఈ దాడికి పాల్పడ్డారని, ఇది పిరికిపందల చర్యగా అయన అభివర్ణించారు. దాడికి బాధ్యులైన వారిని తక్షణం పోలీసులు అరెస్టు చేయాలని బీజేపీ జేకే విభాగం నేత రవీందర్ రైనా డిమాండ్ చేశారు. అమాయక బాలుడి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారని, ఆరుగురు గాయపడ్డారని, దాడికి పాల్పడిన వారు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాజకీయ నేతలు టార్గెట్‌గా ఈ దాడులు జరుగుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే కశ్మీర్‌లోయలోని అనంతనాగ్‌లో ఒక బీజేపీ నేతను, అతని భార్యను దుండగలు నాలుగు రోజుల క్రితం కాల్చిచంపారు.