Terrorists shoot Teachers: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు గురువారం కాశ్మీర్ లోయలో ఇద్దరు ముస్లిమేతర ఉపాధ్యాయులను కాల్చి చంపారు. మరణించిన వారిలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఉన్నారు. ఒకరు కశ్మీరీ పండిట్ కాగా, మరొకరు సిక్కు మహిళ అని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మరణించారు. శ్రీనగర్ జిల్లాలోని ఈద్గా సంగ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఉదయం 11.15 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు, పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ దాడిని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. టీచర్లను చంపడం దారుణమంటూ ట్విట్ చేశారు. ఉగ్రమూకల అనాగరిక చర్యకు ఇద్దరు టీచర్లు బలయ్యారని, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు ఒమర్ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూడా ఈ దాడిని ఖండించింది.
ఇటీవల లోయలో బలపడేందుకు ఉగ్రమూకలు భీభత్సం సృష్టిస్తున్నాయి. మూడు రోజుల నుంచి పలువురిని చంపుతూ ఉగ్రవాదులు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు పౌరులను పొట్టనబెట్టుకున్నారు. అనంతరం మంగళవారం ఉగ్రమూకలు ఓ కశ్మీరీ పండిట్‌ను చంపిన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లోని ఇక్బాల్ పార్క్‌లో ఉన్న ఓ ఫార్మసీ షాపు ఓనర్ 70 ఏళ్ల మఖన్ లాల్ బింద్రూను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
Also Read: