Bollineni Srinivas Gandhi: అవినీతిలో యువ సామ్రాట్.. ఒకే డిపార్ట్‌మెంట్‌లో 13 ఏళ్ల పాటు విధులు.. తవ్వేకొద్ది వెలుగుచూస్తున్న అక్రమాలు!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అరెస్టు చేసింది. అతని అవినీతి చిట్టా మొత్తం బయటపెట్టబోతుందన్న సమాచారం
Bollineni Gandhi Arrest: విధి నిర్వహణలో సూపర్ ఆఫీసర్..వందల కోట్ల రూపాయల అక్రమార్జన.. తవ్వేకొద్ది వెలుగుచూస్తున్న అక్రమాలు.. కుటుంబ సభ్యుల పేర్ల మీద పెద్ద మొత్తంలో ఆస్తుల చిట్టా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో సీబీఐ వరుసగా ఇచ్చిన అనేక నోటీసులకు ఆయన స్పందించక పోవడం, విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన్ను మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
బొల్లినేని శ్రీనివాస గాంధీ. పేరుకు తగ్గట్లే విధి నిర్వహణలో స్టిక్ట్ ఆఫీసర్. అవినీతిలో అంతకు మించిన సామ్రాట్. ఇప్పుడీ హయ్యర్ ఆఫీసర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అతని అవినీతి చిట్టా మొత్తం బయటపెట్టబోతుందన్న సమాచారం అందుతోంది. గతంలో ఉన్న కేసులను తోడుతూనే.. ఆస్తులకు లెక్కలు అడగనుందిబ సీబీఐ. ఒకటి, రెండు, కాదు.. ఏకంగా రూ.200 కోట్లు. ఇది బొల్లినేని శ్రీనివాస గాంధీ ఆస్తుల విలువ. 2019లో వివేకానంద స్వామి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆయనపై కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారన్న ఆరోపణలపై మరో కేసు నమోదైంది. ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఇలా అవినీతి ఆరోపణలకు తోడు.. వరుస కేసులను ఎదుర్కొంటున్నారు గాంధీ.
సెన్షేషనల్ కేసులను హ్యాండిల్ చేయడంలో గాంధీ ఆయనకు ఆయనే సాటి. రుణాల ఎగవేత కేసులను విచారించడంలో సూపర్ ఆఫీసర్. 2014 నుంచి 2017 వరకు ఈడీలో దూకుడు ప్రదర్శించారు బొల్లనేని. అయితే, ఓ కేసులో లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. అదే సమయంలో అవకతవకలు జరిగినట్లు పూర్తి ఆధారాలు ఉన్నా.. సుజనా చౌదరి కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఇలా అన్ని కోణాల్లో విచారించనున్న సిబిఐ అధికారులు.. బొల్లినేని నుంచి ఎలాంటి సమచారం రాబడుతారనే చర్చ సాగుతోంది.
ఈడీ ఆఫీసర్‌గా ఉన్న టైమ్‌ని లెక్కేసి ఆరా తీస్తే పదేళ్లలో ఆయన అధికారిక సంపాదన కేవలం 65 లక్షలే. కానీ కూతురు మెడికల్ సీటు కోసం సింగిల్ పేమెంట్‌లో ఆయన ఇచ్చింది.. అక్షరాలా రూ. 70లక్షలు ఇక ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల లెక్క తవ్వితే వందల కోట్ల రూపాయలు బయటపడుతున్నట్లు తేలింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌లో ఆయన పేరిట మూడు కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉంది. 2019లో తనిఖీలో నిర్వహించిన సమయంలో ఆయన ఇంట్లో మూడు కోట్ల రూపాయలు లభించాయి. హైదరాబాద్, విజయవాడ సహా.. మరికొన్ని చోట్ల బొల్లినేనికి ఆస్తులున్నట్లు సిబిఐ ఆధారాలు సేకరించింది.
బొల్లినేని శ్రీనివాస గాంధీ 1992లో సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. 2002లో సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ పొంది హైదరాబాద్ కమిషనరేట్–1లో పోస్టింగ్ పొందారు. ఆ తర్వాత 2004లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెళ్లి అక్కడే 13 ఏళ్లపాటు పని చేశారు. జీఎస్టీ విభాగంలో పనిచేస్తున్న సమయంలో పెద్ద మొత్తంలో లంచాల తీసుకున్నారన్న ఆరోపణలపై గాంధీపై కేసులు నమోదయ్యాయి.
ఓ కంపెనీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెక్కల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో బొల్లినేనితోపాటు సుధారాణి ఏకంగా రూ. 5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. దీంతో సీబీఐ అధికారులు ఐపీసీ 120బి, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12, 7(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు చేసిన ఈడీ.. భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది.