Tamil Nadu Encounter: తమిళనాడులో రెచ్చిపోయి ఎదురుదాడికి పాల్పడిన చైన్ స్నాచర్ల భరతం పట్టారు పోలీసులు. కత్తులు, తుపాకులతో దాడికి పాల్పడిన దుండగులను.. ఎన్‌కౌంటర్‌లో కాల్చి పడేశారు. ఈ ఘటనతో యావత్ తమిళనాడు రాష్ట్రం ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై, తిరువల్లూర్, కాంచీపురం జిల్లాలో చైన్ స్నాచింగ్ గ్యాంగ్ రెచ్చిపోతోంది. బాధితులకు పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ ఎక్కుపెట్టి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా చాలా దోపిడీలు జరుగడంతో తమిళనాడు పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం తీవ్రంగా వేట సాగించారు. నిందితులు కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ సమీపంలోని తెన్నలూర్ అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లుగా సమాచారం అందుకున్నారు.
వారిని పట్టుకునేందుకు పోలీసులు ఆ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఈ క్రమంలో పోలీసుల రాకను గుర్తించిన దుండగులు.. పోలీసులపై ఎదురు దాడికి దిగారు. తుపాకులతో కాల్పులు జరుపుతూ, కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఇక లాభం లేదనుకున్న పోలీసులు.. ఆత్మరక్ష చర్యల్లో భాగంగా దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్‌లోని ఒకరు చనిపోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరికొంతమంది తెన్నలూర్ ప్రాంతంలోనే ఉన్నారని తెలుసుకున్నారు. దాంతో వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. కాగా నిందితులంతా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
Also read:
IPL 2021 Purple Cap: టాప్ 5 లో నలుగురు భారత బౌలర్లు.. అగ్రస్థానంలో కోహ్లీ ఫేవరేట్ ప్లేయర్
Bank holidays October 2021: ఖాతాదారులకు అలెర్ట్.. వరుసగా 9 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడప్పుడంటే..?