ఇది ముమ్మాటికీ తృణముల్ కాంగ్రెస్ ప్రత్యర్థుల పనే, బాంబు దాడి బాధిత మంత్రికి సీఎం మమత పరామర్శ
బాంబుదాడిలో గాయపడ్డ మంత్రి జాకిర్ హుస్సేన్‌ను పరామర్శించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు...
బాంబుదాడిలో గాయపడ్డ మంత్రి జాకిర్ హుస్సేన్‌ను పరామర్శించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇది ముమ్మాటికీ తృణముల్ కాంగ్రెస్ ప్రత్యర్థుల పనేనని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుతం మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన చేయి, కాలికి గాయాలైనట్లు తెలిపారు. కార్మిక శాఖ మంత్రి జాకీర్ హుస్సేన్‌పై బాంబు దాడి ఘటనను మమత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసును బెంగాల్ సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముర్షిదాబాద్‌లోని నింటిటా రైల్వే స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతాన్ని సీఐడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాలు సేకరించారు.
రాత్రి బెంగాల్ కార్మిక శాఖ మంత్రి జాకిర్ హుస్సేన్‌పై బాంబు దాడి జరిగింది. ముర్షిదాబాద్ జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కోల్‌కతా వెళ్లేందుకు నిమ్టిటా స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆయనపై దుండగులు బాంబులు విసిరారు. వెంటనే ఆయన్ను చికిత్స కోసం ముర్షీదాబాద్ మెడికల్ కాలేజ్‌కు తరలించారు.