India Covid-19: అవే కొంపముంచాయి.. భారత్‌లో కరోనా విజృంభణపై డబ్ల్యూహెచ్ఓ సంచలన నివేదిక
WHO on India Coronavirus: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. నిత్యం నాలుగు లక్షల కేసులు, నాలుగు వేల మరణాలు నమోదవుతున్నాయి. అయితే.. దేశంలో కరోనా విజృంభణకు మ
WHO on India Coronavirus: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. నిత్యం నాలుగు లక్షల కేసులు, నాలుగు వేల మరణాలు నమోదవుతున్నాయి. అయితే.. దేశంలో కరోనా విజృంభణకు మతపరమైన కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. వైరస్ ఉధృతి పెరగడానికి కొత్త వైరస్ రకాలు కూడా మరో కారణమని తెలిపింది. భారత్‌లో కేసులు అధికంగా నమోదవడానికి గల కారణాలపై డబ్ల్యూహెచ్ఓ ఓ నివేదికను విడుదల చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి మతపరమైన, రాజకీయ పరమైన భారీ సమావేశాలు, సభలు ప్రధాన కారణమని నివేదించింది. అదేవిధంగా సంక్రమణ వేగం ఎక్కువగా ఉన్న వైరస్ రకాలు వ్యాప్తిలో ఉండటం, ఆరోగ్య సామాజిక భద్రతా ప్రమాణాలను ప్రజలు పాటించకపోవడం వల్ల దేశం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని వెల్లడించింది.
బీ 1.1.7, బీ 1.612 తదితర రకాల కరోనా వేరియంట్లు భారత్‌లో కేసులను పతకాస్థాయికి తీసుకెళ్లాయని.. వీటివల్ల భారీగా కేసులు వెలుగులోకి వస్తున్నాయని వెల్లడించింది. ప్రమాదకర బీ.1.617 రకాన్ని దేశంలో తొలిసారిగా గతేడాది అక్టోబర్‌లోనే గుర్తించారని గుర్తుచేసింది. అందులో ఉప రకాలు కూడా ఆ తర్వాత ఒక్కొక్కటిగా వెలుగుచూశాయని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 21 శాతం బీ.1.617.1 వల్ల, ఏడు శాతం బీ.1.617.2 వల్ల నమోదైనవేనని అభిప్రాయపడింది. ఇతర రకాలతో పోలిస్తే ఈ రెండూ అధిక సంక్రమణ వేగాన్ని కలిగి ఉన్నాయని పేర్కొంది.
దేశంలో గత రెండు నెలల నుంచి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, ఉత్తరాఖండ్‌లో కుంభమేళా జరిగిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్లే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని, దీనికి కేంద్ర ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని మద్రాస్ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కుంభమేళా నిర్వహణపై కూడా పలు విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.