రైల్వే అనౌన్స్‌మెంట్: టి‌కెట్ బుకింగ్ లో కొత్త మార్గదర్శకాలు…ఇవి తప్పనిసరి

టికెట్ బుకింగ్‌లో కొత్తగా క్వారంటైన్ రూల్స్ పెట్టింది ఐఆర్ సీటీసీ. అన్ని షరతులకు అంగీకరించి కన్ ఫాం టికెట్ పొందిన వారు మాత్రమే రైల్వే స్టేషన్ కు రావాల్సిందిగా రైల్వేశాఖ సూచించింది.

  • Jyothi Gadda
  • Publish Date - 1:42 pm, Mon, 18 May 20
రైల్వే అనౌన్స్‌మెంట్: టి‌కెట్ బుకింగ్ లో కొత్త మార్గదర్శకాలు...ఇవి తప్పనిసరి

కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయింది. గత మూడు నెలలుగా ప్రపంచ దేశాలు కంటికి కనిపించని శత్రువు కరోనాతో నిరంతర యుద్ధం చేస్తున్నాయి. వైరస్ భూతం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే భౌతిక దూరం, పరిశుభ్రత ఒక్కటే మార్గంగా భావించిన ఆయా దేశాలు..లాక్‌డౌన్ మంత్రం పాటిస్తున్నాయి. భారత్‌లోనూ లాక్‌డౌన్ కొనసాగుతోంది. బస్సులు,  రైళ్లు అన్ని నిలిచిపోయాయి. కేవలం పార్సెల్, గూడ్స్ రైళ్లు మాత్రమే కొనసాగుతున్నాయి.

అయితే, వలస కార్మికులను వారి సొంత రాష్ట్రానికి తీసుకెళ్లడానికి మే 1 నుండి శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడపడం ప్రారంభించింది కేంద్రం. ఈ క్రమంలోనే సామాన్య ప్రజల కోసం రాజధాని ఎక్స్‌ప్రెస్ మార్గంలో సాధారణ మార్గదర్శకాల ప్రకారం 15 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. అయితే, ఇక్కడే రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సిటిసి కొత్త రూల్స్ ప్రకటించింది.

ఇండియన్ రైల్వే ఐఆర్‌సిటిసి టికెట్ బుకింగ్‌లో ఇప్పుడు కొత్త విధానం తీసుకొచ్చింది. ప్రయాణీకులు ఎవరైనా సరే …ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే..వారు ఏ రాష్ట్రాలకు వెళ్తారో అక్కడి పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు విధించే క్వారంటైన్ నిబంధనలను అంగీకరించాలని చెప్పింది. అలా అంగీకరించిన వారికి మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఐఆర్‌సిటిసి వెబ్ సైట్‌లో టికెట్ బుకింగ్ చేసుకొనే పోర్టల్‌లో కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది.

ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లిన కొందరు ప్రయాణికులు అక్కడి అధికారుల సూచనల మేరకు క్వారంటైన్ వెళ్లేందుకు నిరాకరించారు.  క్వారంటైన్ పాటించాలని చెప్పిన అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. జరిగిన ఘటనతో  రైల్వే అధికారులు అప్రమత్తమై… టికెట్ బుకింగ్‌లో కొత్తగా క్వారంటైన్ రూల్ పాటించాల్సిందేనని నియమం పెట్టారు. అన్ని షరతులకు అంగీకరించి కన్ ఫాం టికెట్ పొందిన వారు మాత్రమే రైల్వే స్టేషన్ కు రావాల్సిందిగా రైల్వేశాఖ సూచించింది.