కరోనా అలర్ట్..తల్లి నుంచి గర్భస్థశిశువుకు వైరస్! దేశంలో తొలి కేసు..!
ఇటీవలి కాలంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశలోకి వెళ్లిపోయిందనే వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో వైరస్ వ్యాప్తికి సంబంధించిన మరో ఊహించని ఘటన వెలుగు చూసింది.

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇంకా ప్రతాపం చూపెడుతోంది. రోజులు, నెలలూ గడుస్తున్న..వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. పైగా, ఇటీవలి కాలంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశలోకి వెళ్లిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇటువంటి తరుణంలో వైరస్ వ్యాప్తికి సంబంధించిన మరో ఊహించని ఘటన వెలుగు చూసింది.
కొవిడ్-19 సోకిన తల్లులకి పుట్టిన పిల్లలెవరికీ ఇంతవరకు కరోనా వైరస్ సంక్రమించలేదు అన్నది ఇప్పటి వరకు తెలిసిన విషయం. కానీ, తల్లి నుంచి గర్భస్థశిశువుకు కరోనా సోకిన తొలి ఘటనను తాము గుర్తించామని పూణేకు చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి పక్రటించింది. దేశంలో ఇలాంటి కేసు నమోదవడం ఇదే తొలిసారిగా అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు. కాగా, సదరు శిశువు మేనెలలో జన్మించాడని, ప్రస్తుతం అతడు కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు.
గర్భంలో ఉన్న శిశువుకు తల్లి నుంచి వ్యాధి సంక్రమించడాన్ని వైద్య పరిభాషలో వర్టికల్ ట్రాన్స్‌మిషన్ అంటారు. బొడ్డుతాడు(ప్లాసెంటా) ద్వారా తల్లి నుంచి శిశువుకు కరోనా సోకి ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు. అయితే తనకున్న శక్తిమంతమైన రోగ నిరోధక శక్తికారణంగా తల్లి తనంతట తానే కరోనా నుంచి కోలుకుని ఉంటుందని వైద్యులు తెలిపారు.




