దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ల గుర్తింపు.. నిర్లక్ష్యం వహిస్తే దాడికి రెడీ.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. తగ్గిపోతుందనుకున్న తరుణంలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వ్యాక్సిన్‌ వచ్చినా.. కోవిడ్‌ విశ్వరూపం చూపిస్తునే ఉంది.

  • Balaraju Goud
  • Publish Date - 10:34 am, Wed, 24 February 21
దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ల గుర్తింపు.. నిర్లక్ష్యం వహిస్తే దాడికి రెడీ.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

New Covid-19 strains in India : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. తగ్గిపోతుందనుకున్న తరుణంలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వ్యాక్సిన్‌ వచ్చినా.. కోవిడ్‌ విశ్వరూపం చూపిస్తునే ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉంటే దాడి చేసేందుకు రెడీ అంటోంది. ఒకటి రెండు కాదు..8 రాష్ట్రాల్లో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమాంతం పెరిగిపోయాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాల్లో మరోసారి కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది.

దేశంలో రెండు కరోనా కొత్త స్ట్రెయిన్లను గుర్తించింది కేంద్రం. అవి ఎన్‌440కె, ఈ484కె. ఈ కొత్త స్ట్రెయిన్లు ఉన్న కేసులను మహారాష్ట్ర, కేరళ, తెలంగాణలో గుర్తించామని అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఈ రెండూ మహారాష్ట్రలో ఉన్నట్లు చెబుతున్నారని.. అయితే, ఇవి తెలంగాణ, కేరళలో కూడా ఉన్నాయని నీతి ఆయోగ్‌ వెల్లడించింది.. మహారాష్ట్ర, కేరళల్లో పాజిటివ్‌ల పెరుగుదలకు ఈ స్ట్రెయిన్‌లే కారణమనేందుకు ఆధారాలు లేవంటున్నారు..ఇక ఇదే విషయమై సీసీఎంబీ కూడా పరిశోధన చేసింది..

ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా ఏడు వేల వేరియంట్స్‌ ఉన్నాయంట..ఇవి చాలావరకు తీవ్ర ప్రమాదాకారులని సీసీఎంబీ అంటుంది..వీటిలో ఎన్‌440కె వేరియంట్‌ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది..దేశంలో ఐదు వేలకుపైగా వైరస్‌ వేరియంట్లపై సీసీఎంబీ విస్తృత విశ్లేషణ చేశారు. అయితే, ప్రతి వేరియంట్‌ కొత్త స్ట్రెయిన్‌ కాదని సీసీఎంబీ తేల్చింది..దేశంలో కరోనా జన్యు విశ్లేషణలో భారత్‌ వెనుకంజలో ఉందని సీసీఎంబీ పేర్కొంది.కోటిపైగా కేసులు నమోదైనా.. అందులో 6,400 నమూనాల జన్యువిశ్లేషణ మాత్రమే పూర్తయిన సంగతి గుర్తి చేసింది..

దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్‌ కేసుల్లో 75% కేసులు మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయి. కేరళ నుంచి 38%, మహారాష్ట్ర నుంచి 37%, కర్ణాటక 4%, తమిళనాడులో 2.78% యాక్టివ్‌ కేసులున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.. ఇప్పటికీ యాక్టివ్‌ కేసులు లక్షన్నర కంటే తక్కువగానే ఉన్నాయి. కరోనా విలయతాండవం చేస్తుండటంతో మహారాష్ట్ర, రాజస్థాన్‌లో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. అమరావతి, యావత్మల్‌ జిల్లాల్లో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించారు.మహారాష్ట్ర లాతూర్‌లోని ఓ హాస్టల్‌లో 39 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది..360మందికి పరీక్షలు చేయగా.. 39మంది విద్యార్థులు, ఐదుగురు ఉద్యోగులకు కరోనా ఎటాక్‌ అయ్యింది..రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో 144 సెక్షన్‌ అమలుచేస్తున్నారు.

ఇక ఇటు ఢిల్లీలోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ప్రజా రవాణా వ్యవస్థలో పరిమితులు విధించారు. రెండు వారాల పాటు బస్సులు, మెట్రోలో పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులకు అనుమతించనున్నారు.కరోనా పరీక్షలు తప్పనిసరి చేసిన ఢిల్లీ సర్కార్‌ ఈనెల 26 నుంచి మార్చి 15 వరకు ఆంక్షలు అమలు చేయనుంది..పంజాబ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుండడంతో ఇన్‌డోర్, ఔట్‌డోర్‌ సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కోవిడ్‌–19 హాట్‌స్పాట్లలో అవసరమైన ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించే అధికారాన్ని డిప్యూటీ కమిషనర్లకు కట్టబెట్టింది.

మరోవైపు కరోనా వైరస్‌ కేరళ, కర్ణాటక మధ్య వివాదాన్ని రాజేస్తోంది. కేరళలో కేసులు ఎక్కువగా నమోదవడంలో కర్నాటక సీఎం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మరింది. కేరళ-కర్ణాటక మధ్య సరిహద్దుల్ని మూసివేస్తూ యడియూరప్ప ఆదేశాలు జారీచేశారు. ఈ నిర్ణయంపై కేరళ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయాన్ని తప్పుపడుతూ కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులను వెంటనే తెరపాలని కోరారు.

Read Also…  రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం.. టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ అయితే.. ఫ్రీ రైడ్..!