AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MEDICAL DOCTORS: కరోనాపై పోరులో అసువులు బాసిన వైద్యులెందరో..? యుపీ, బీహార్‌లలోనే ఎక్కువ

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. గత వారమంతా దేశంలో ప్రతీ రోజు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో నాలుగు వేలకు పైగా ప్రతీ రోజూ మృత్యువాత పడ్డారు. గత నాలుగు రోజులుగా...

MEDICAL DOCTORS: కరోనాపై పోరులో అసువులు బాసిన వైద్యులెందరో..? యుపీ, బీహార్‌లలోనే ఎక్కువ
Medical Department Inindia
Rajesh Sharma
|

Updated on: May 18, 2021 | 4:51 PM

Share

MEDICAL DOCTORS LOSING LIFES IN CORONA FIGHT: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. గత వారమంతా దేశంలో ప్రతీ రోజు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో నాలుగు వేలకు పైగా ప్రతీ రోజూ మృత్యువాత పడ్డారు. గత నాలుగు రోజులుగా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 20 రోజుల తర్వాత దేశంలో ప్రతీరోజు నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలకు దిగువకు చేరింది. మే 18 కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా రెండు లక్షల 63 వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య తగ్గడం, ఆల్‌రెడీ వైరస్ సోకి.. కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడం.. కొంత ఊరట నిచ్చే వార్తలే. కానీ మరణాల సంఖ్య తగ్గకపోవడం.. బ్లాక్ ఫంగస్ పేరిట కొత్త ఇబ్బందులు రావడం కలవరం రేపేదేనని చెప్పుకోవాలి. మరణాలు ప్రతీ రోజులు నాలుగు వేలకుపైగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మే 18న వెల్లడించిన వివరాల ప్రకారం మరణాలు రికార్డు స్థాయిలో 4,300 దాటాయి. ఇదిలా వుంటే.. మరణాల్లో పలువురు ఫ్రంట్ లైన్ వర్కర్లుండడం మరింత కలచి వేసే విషయం.

కరోనా మహమ్మారి పెద్దా-చిన్నా, పేద-ధనికా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ బలి తీసుకుంటోంది. వైరస్‌ ధాటికి సామాన్యులే కాదు.. ప్రాణాలు పోసే వైద్యులు కూడా చాలా మంది చనిపోతున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెలిపిన వివరాల ప్రకారం… గత ఏడాది ఫస్ట్‌వేవ్‌లో 748 మంది వైద్యులు కరోనాతో చనిపోగా… ఈ సెకండ్‌ వేవ్‌లో గత రెండు నెలల్లో 269 మంది డాక్టర్లను కరోనా పొట్టన పెట్టుకుంది. మొత్తంగా వెయ్యిమందికి పైగా వైద్యులను రాకాసి కరోనా వైరస్‌ బలి తీసుకుందని ఐఎంఏ వెల్లడించింది.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో రికవరీ రేటు గణనీయంగా పెరిగింది. మే 3వ తేదీన రికవరీ రేటు 81.7 శాతం వుండగా.. మే 18 నాటికి రికవరీ రేటు 85.6 శాతానికి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో (మే 17 నుంచి 18) నాలుగు లక్షల 22 వేల 436 మంది కరోనా సోకిన వారు కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక డిశ్చార్జిలు జరిగిన రోజుగా రికార్డు సృష్టించింది. కోవిడ్ రికవరీల్లో సానుకూల పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇంకా 8 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. 10 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్యలో కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 18 రాష్ట్రాల్లో 50వేల కంటే తక్కువ యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ ప్రకటించారు.

ఐఎంఏ అధికారిక సమాచారం అయినప్పటికీ… ఆ సంఖ్య ఎక్కువే ఉండవచ్చునని తెలుస్తోంది. భారత్‌లో మొత్తం 12 లక్షల మంది వైద్యులు ఉన్నారు. ఐఎంఏ కేవలం 3.5 లక్షల మంది సభ్యుల రికార్డు ఆధారంగా మాత్రమే గణాంకాలు వేసింది. తాజాగా రాష్ట్రాల వారీగా డేటాను విడుదల చేయగా…అందులో బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ మంది వైద్యులు మహమ్మారికి బలయ్యారని తేలింది. బీహార్‌ 78మంది, ఉత్తరప్రదేశ్‌ 37 మంది ప్రాణాలు కోల్పోగా.. తర్వాతి స్థానాల్లో ఢిల్లీలో 28 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 22 మంది, తెలంగాణలో 19 మంది, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో చెరో 14 మంది, తమిళనాడులో 11 మంది వైద్యులు కరోనా బారిన పడి చనిపోయారు. అలాగే ఒడిశాలో 10 మంది వైద్యులు, కర్ణాటకలో 8, మధ్యప్రదేశ్‌లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వైద్యులతోపాటు ఇతర మెడికల్ సిబ్బంది కూడా కరోనాకు పెద్ద సంఖ్యలోనే బలయ్యారు. కరోనాతో జరుగుతున్న పోరాటంలో అసువులు బాసిన వైద్య సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వాలు పెద్దఎత్తున ఆర్థిక సాయం ప్రకటించడం కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం.

ALSO READ: పెద్దన్న పాత్రలోకి మళ్ళీ అమెరికా.. 8 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీకి రెడీ

ALSO READ: నెతన్యాహుకు బైడెన్ ఫోన్.. రాకెట్ దాడులను సమర్థిస్తూనే.. కాల్పుల విరమణ పాటించాలట!