AMERICA VACCINES: పెద్దన్న పాత్రలోకి మళ్ళీ అమెరికా.. 8 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీకి రెడీ

ఏ క్షణాన అమెరికాను ప్రపంచ పెద్దన్న అని అభివర్ణించారోగానీ ఆ దేశం ఆ పేరును నిలబెట్టుకునేందుకు అప్పుడప్పుడూ ప్రయత్నిస్తూనే వుంది. ఈ ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ కాలంలో కొద్దిగా తగ్గిందేమో గానీ.. బైడెన్ అధికార పగ్గాలు...

AMERICA VACCINES: పెద్దన్న పాత్రలోకి మళ్ళీ అమెరికా.. 8 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీకి రెడీ
Vaccne
Follow us
Rajesh Sharma

|

Updated on: May 18, 2021 | 4:48 PM

AMERICA VACCINES TO MANY COUNTRIES: ఏ క్షణాన అమెరికాను ప్రపంచ పెద్దన్న అని అభివర్ణించారోగానీ ఆ దేశం ఆ పేరును నిలబెట్టుకునేందుకు అప్పుడప్పుడూ ప్రయత్నిస్తూనే వుంది. ఈ ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ కాలంలో కొద్దిగా తగ్గిందేమో గానీ.. బైడెన్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మళ్ళీ వేగమందుకున్నాయి. అటు ఇజ్రాయిల్, పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య యుద్దం కొనసాగుతుండగాా.. కాల్పుల విరమణ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించిన బైడెన్ పెద్దరికాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో మరో చర్య ద్వారా అమెరికాను పెద్దన్న అని ఎందుకంటారో.. ఎందుకు అనాలో తేల్చి చెప్పారు.

గత సంవత్సరం కరోనా కష్ట కాలంలో ట్రంప్ తెంపరితనంతో అతలాకుతలమైన అమెరికా.. చివరికి పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంది. ప్రపంచంలో ప్రయోగాలు మొత్తం పూర్తికాకుండానే కరోనా వ్యాక్సిన్ను వేయడం ప్రారంభించిన అమెరికా చానాళ్ళపాటు అమెరికన్లను రక్షించుకునేందుకే మొగ్గు చూపింది. అమెరికన్లందరికీ వ్యాక్సిన్ అందిన తర్వాతనే శాస్త్రపరిఙ్ఞానాన్ని ఇతర దేశాలకు ఇస్తామని పలు మార్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో కరోనా వైరస్ ధాటికి జనం పిట్టల్లా రాలుతుంటే అగ్రరాజ్యం దిక్కుతోచని పరిస్థితికి చేరింది ఓ దశలో. కానీ ఆ తర్వాత అగ్రరాజ్యంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. అదే సమయంలో మరణాలు అదుపులోకి వచ్చాయి. అయితేనేం.. ఇప్పటికి కరోనా ధాటికి అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా అమెరికానే నిలిచింది.

నిజానికి అమెరికా జనాభా 33 కోట్లు మాత్రమే.. కానీ దాదాపు ఆరు లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలయ్యారు. అదే సమయంలో మన దేశ జనాభా సుమారు 140 కోట్లు.. కానీ ఇప్పటి వరకు మన దేశంలో మరణాల సంఖ్య మూడు లక్షలు కూడా దాటలేదు. మరణాల సంఖ్య తాజాగా పెరుగుతున్న దశలో మనం కంగారు పడుతున్నప్పటికీ.. మన దేశ జనాభా, జనసాంద్రత దృష్ట్యా మనదేశంలో మరణాల సంఖ్య, శాతం అదుపులో వున్నట్లుగానే భావించాల్సి వుందని కొందరంటున్నారు. ఇదంతా పక్కన పెడితే.. అమెరికాలో కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ఆ దేశం ప్రపంచ పెద్దన్న పాత్రను పోషించేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే కరోనాతో అల్లాడుతున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీపికబురు చెప్పారు. ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌తో పాటు ఫైజర్‌ బయో ఎన్‌టెక్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్స్‌ టీకాలను వచ్చే ఆరువారాల్లో అందించనున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాల్లో మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంటే.. అమెరికా సైతం క్షేమంగా ఉండలేదన్నారు. క‌రోనాను అంత‌మొందించేందుకే వ్యాక్సిన్ సాయం చేస్తుమని… వచ్చే ఆరువారాల్లో 80 మిలియన్ల (8 కోట్లు) టీకా డోసులు ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని ట్వీట్‌ చేశారు.

నిజానికి మనదేశంలో కరోనా కంట్రోల్ అయినట్లు అనిపించగానే..  దేశీయ అవసరాలను కొద్దిగా తీరుస్తూనే దాదాపు 84 దేశాలకు వ్యాక్సిన్ డోసులను ఇండియా పంపిణీ చేసింది. ఈ విషయంలో భారత దేశ ఔదార్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు పలు చిన్నా చితకా దేశాలు ప్రశంసించాయి. మన దేశం కంటే ముందుగా కరోనాకు వ్యాక్సిన్‌ను కనిపెట్టి, పంపిణీని ప్రారంభించిన అమెరికా, రష్యా, చైనాలు కూడా చిన్న దేశాలకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు అప్పట్లో ముందుకు రాలేదు. కానీ తాజాగా భారత్‌లో సెకెండ్ వేవ్ ముంచుకొచ్చిన నేపథ్యంలో మనదేశం ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరాను నిలిపి వేసింది. దాంతో పెద్దన్న పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు అమెరికా రెడీ అవుతోంది.

అమెరికాలో క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కరోనా వైరస్ మొదలైన తర్వాత తొలిసారిగా 50 రాష్ట్రాల్లో కేసులు తగ్గాయని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికాలో ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 60 మిలియన్‌ మోతాదుల నిల్వ ఉంది. ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అథారిటీ క్లియరెన్స్‌ వచ్చిన తర్వాత కంపెనీ వాటిని వివిధ దేశాలకు రవాణా చేస్తుంది. ప్రపంచ దేశాల నుంచి బైడెన్‌ పాలకవర్గంపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వీలైనంత త్వరగా సాయం అందజేయాలని శ్వేతసౌధానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. వ్యాక్సిన్‌ సహా ఇతర అవసరమైన వైద్య సామగ్రి పంపాలని భారత్ తో పాటు మిగతా దేశాలు కూడా బైడెన్‌ ప్రభుత్వాన్ని కోరాయి.

ALSO READ: నెతన్యాహుకు బైడెన్ ఫోన్.. రాకెట్ దాడులను సమర్థిస్తూనే.. కాల్పుల విరమణ పాటించాలట!