Modi : ఇప్పటి పరిస్థితులు.. భవిష్యత్‌లో మరిన్ని క్లిష్టమైన సమస్యలను సమర్థంగా ఎదుర్కోడానికి దోహదపడతాయి : ప్రధాని మోదీ
PM Modi on Covid-19 management : కరోనా మహమ్మారిపై పోరులో మీ జిల్లా విజయం సాధిస్తే దేశం గెలిచినట్లేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు...
PM Modi on Covid-19 management : కరోనా మహమ్మారిపై పోరులో మీ జిల్లా విజయం సాధిస్తే దేశం గెలిచినట్లేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరాను భారీ స్థాయిలో పెంచడానికి నిరంతరం కృషిచేస్తున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్ పాలసీని, ప్రక్రియను ఆరోగ్య శాఖ మెరుగుపరిచే పనిలో ఉందన్న ఆయన, రాష్ట్రాలకు 15 రోజుల ముందే ప్రణాళికను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. దీని వల్ల జిల్లాల్లోని ప్రజలకు వ్యాక్సిన్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయో, దానికి వారు ఎలా సిద్ధం కావాలో ముందే తెలుస్తుందన్నారు. “దేశంలోని వివిధ జిల్లాల్లో అనేక రకాల సమస్యలున్నాయి. అయితే మీ జిల్లాలో సమస్యలు మీకే బాగా తెలుస్తాయి. మీ జిల్లా ఆ సమస్యల నుంచి బయటపడితే, అది ఈ దేశం సాధించిన విజయమే అవుతుంది. మీ జిల్లా కోవిడ్19పై విజయం సాధిస్తే, ఈ దేశం కూడా విజయం సాధిస్తుంది.” అని మోదీ చెప్పుకొచ్చారు. స్థానికంగా కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసుకోవడం, పరీక్షలను పెద్ద సంఖ్యలో చేయడం, ప్రజలకు సరైన, సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచడం… కరోనావైరస్‌పై పోరాటంలో ఇవే మన ఆయుధాలని మోదీ అన్నారు. కరోనా కట్టడిపై అన్ని రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో ఈరోజు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాతో పోరులో అధికారులే ఫీల్డ్ కమాండర్లని ప్రధాని అన్నారు.
మహమ్మారి సమయంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు.. భవిష్యత్ లో మరిన్ని క్లిష్టమైన సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడానికి దోహదపడతాయన్నారు. ఇలాంటి సమస్యలు మళ్లీ వస్తే మెరుగైన కార్యాచరణ చేసేందుకు ఆ అనుభవం ఉపయోగపడుతుందని మోదీ అన్నారు. “గతంలో మనం వ్యవసాయ రంగంపై లాక్‌డౌన్ విధించలేదు. కానీ పొలాల్లో రైతులు భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకున్న రైతులు తమ పనితీరును దానికి అనుగుణంగా మార్చుకున్నారు. గ్రామాల సామర్థ్యం ఇదే.” అంటూ మోదీ రైతన్నలను ఆకాశానికెత్తారు.