Maratorium on booster dose: బూస్టర్ డోసుపై మారటోరియం.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ తాజా సూచన.. ఆచరణ సాధ్యమేనా..?

ఆల్ రెడీ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో వింత ప్రవర్తన మొదలయ్యింది. చాలా మంది కాస్త మెచ్యురిటీతో రెండు డోసులతో ఉత్పన్నమైన యాంటీబాడీస్‌తో కరోనాను ఎదుర్కొనేందుకు సిద్దమైతే.. కొందరు మాత్రం మూడో డోసు వేసుకోవడం ద్వారా మరిన్ని యాంటీ బాడీస్ పెంచుకుందామన్న ఆలోచన చేశారు. ఫలితంగా బూస్టర్ డోస్‌పై చర్చలు మొదలయ్యాయి.

Maratorium on booster dose: బూస్టర్ డోసుపై మారటోరియం.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ తాజా సూచన.. ఆచరణ సాధ్యమేనా..?
Corona Virus
Follow us
Rajesh Sharma

|

Updated on: Sep 29, 2021 | 3:17 PM

Maratorium on booster dose WHO suggestion to countries: కరోనావైరస్ గత ఏడాదిన్నరకాలానికిపైగా మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. వైరస్ నిరోధానికి వ్యాక్సిన్లు కనిపెట్టినా.. ఈ మహమ్మారి ఇపుడపుడే వదలన్న సంకేతాలను పంపుతూనే వుంది. వైరస్ మ్యూటేట్ అవుతూ.. కొత్త వేరియంట్లుగా మారి తన సత్తా చాటుతూ.. కేసులను, మరణాలను పెంచుతోంది. అగ్రరాజ్యం అమెరికా వ్యాక్సిన్ కనుగొని.. తమ దేశంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని భావించినప్పటికీ తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్‌తో విరుచుకుపడిన కరోనా అక్కడ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. సెప్టెంబర్ రెండు, మూడు వారాల్లో అమెరికాలో ప్రతిరోజు సగటున 1.8 లక్షల కేసులు నమోదయ్యాయి. అదేకాలంలో ప్రతి రోజు 2 వేల మరణాలు సగటున నమోదయ్యాయి. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలలో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ విరుచుకుపడింది. ప్రభుత్వాసుపత్రులన్నీ కరోనా బాధితులతో కిక్కిరిసి పోయాయి. బెడ్లు చాలక, ఆక్సిజన్ అందక మరణాలు సంభవించాయి. ఇంకోవైపు కరోనా జన్మస్థలమైన చైనాలోను డెల్టా ప్లస్ వేరియంట్ విస్తరించింది. దక్షిణ చైనాలోను మూడు ప్రావిన్సుల్లో కఠినమైన నిబంధనలను చైనా అమలు చేసింది. అదేసమయంలో వూహన్ సిటీలో ప్రతీ పౌరునికి కరోనా పరీక్షలు నిర్వహించింది అక్కడి స్థానిక అధికార యంత్రాంగం. ఈక్రమంలో వ్యాక్సిన్ వినియోగంపై చర్చలు మొదలయ్యాయి. వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయాలని పలు దేశాలు నిర్ణయించాయి. కానీ.. ఆల్ రెడీ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో వింత ప్రవర్తన మొదలయ్యింది. చాలా మంది కాస్త మెచ్యురిటీతో రెండు డోసులతో ఉత్పన్నమైన యాంటీబాడీస్‌తో కరోనాను ఎదుర్కొనేందుకు సిద్దమైతే.. కొందరు మాత్రం మూడో డోసు వేసుకోవడం ద్వారా మరిన్ని యాంటీ బాడీస్ పెంచుకుందామన్న ఆలోచన చేశారు. ఫలితంగా బూస్టర్ డోస్‌పై చర్చలు మొదలయ్యాయి. రెండో డోసు తర్వాత 8 నుంచి 10 నెలల పాటే శరీరంలో యాంటీబాడీస్ వుంటాయన్న కథనాలు చాలా మందిలో బూస్టర్ డోసు అవసరమన్న అభిప్రాయాన్ని పెంచాయి.

అయితే, తాజాగా కరోనాతో సహజీవనం అనివార్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌ఓ సీనియర్‌ అధికారి పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ చేసిన ప్రకటనను పరిశీలిస్తే.. దీర్ఘకాలం పాటు కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపింపజేస్తూనే ఉంటుందని తెలుస్తోంది. ఈక్రమంలో కరోనా వైరస్ పాండెమిక్ స్థితి నుంచి ఎండెమిక్‌ స్థాయికి దిగివస్తుందా అన్నదానిపై క్రమంగా క్లారిటీ వస్తోంది. వ్యాక్సిన్లు.. రోగనిరోధకతపై ఇది ఆధారపడి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. తనదేశంలో సెకెండ్ వేవ్ కరోనా కంట్రోల్ అయినట్లుగానే భావించాలి. మూడో వేవ్ వస్తుందా రాదా అన్నదింకా క్లారిటీ లేదు. కానీ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవడంతో థర్డ్ వేవ్ వచ్చినా అంతగా ప్రభావం వుండకపోవచ్చన ఊరట కలిగించే అంఛనాలు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలలో మాత్రం కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అమెరికా దేశం ఇందుకు పెద్ద ఉదాహరణగా పేర్కొనాలి. అయితే.. కరోనా విస్తృతి కొనసాగుతున్న దేశాలపై డబ్ల్యూహెచ్ఓ ఓ క్లారిటీకి వచ్చినట్లు పూనమ్ ఖేత్రపాల్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకోని వారి వల్లే కరోనా పాజిటవ్ కేసులు పెరుగుతున్నాయని, మరణాలూ సంభవిస్తున్నాయని పూనమ్ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బూస్టర్ డోసుపై కూడా క్లారిటీ రావాల్సిన అవసరాన్ని సూచించే వ్యాఖ్యలు చేశారు పూనమ్ ఖేత్రపాల్. మొదటి డోసు కోసం వెయిట్ చేస్తున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో వున్న కారణంగా ఆల్ రెడీ రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీస్ వుండడం… అదేసమయంలో ఒకవేళ కరోనా వైరస్ సోకినా వ్యాక్సిన్ వేసుకోని వారితో పోలిస్తే.. వేసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా వుండడం, ప్రాణాంతకం కాకపోవడం వంటి అంశాలను డబ్లూహెచ్ఓ విశ్లేషిస్తోంది. తాజా సమాచారం ప్రకారం బూస్టర్ డోసులపై దేశాలు మారటోరియం విధించాలని డబ్ల్యూహెచ్ఓ సూచనలు చేయడం ప్రారంభించింది. వ్యాక్సిన్లను బూస్టర్‌ డోసుల కోసం వినియోగించడం వల్ల.. మొదటి డోసు కోసం వెయిట్ చేస్తున్న కోట్ల మందికి ఇబ్బంది అవుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. అందుకే… బూస్టర్‌ డోసు వినియోగంపై 2021 చివరి వరకు మారటోరియం విధించాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చిందని పూనమ్ ఖేత్రాపాల్ చెప్పడమే మారటోరియం వాదనలను బలపరుస్తోంది. ఆరోగ్య కార్యకర్తలు, వైరస్‌ ముప్పు ఎక్కువగా ఉన్న వారు సహా ప్రతి దేశంలోనూ 40 శాతం జనాభాకు టీకాలు అందేలా చూడటం దీని ఉద్దేశమని కూడా పూనమ్ తెలపడం గమనార్హం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేవరకూ ఏ ఒక్కరూ సురక్షితం కాదన్న వాస్తవాన్ని అందరు అర్థం చేసుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారానికి పూనుకోనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొంతకాలం తర్వాత తీవ్రస్థాయి ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షించడంలో కొవిడ్‌ టీకాల సమర్థత తగ్గుతుందనడానికి కచ్చితమైన ఆధారలేమీ లేవని… తీవ్ర వ్యాధి, మరణాల ముప్పును ఇవి తగ్గిస్తూనే ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ పరిశోధకుల బృందం అంఛనా వేస్తోంది. అయితే భవిష్యత్‌లో కొన్ని వర్గాలకు బూస్టర్‌ డోసులు అవసరం కావొచ్చని.. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా దీనిపై డబ్ల్యూహెచ్‌వో సూచనలు చేసే అవకాశాలున్నాయని పరిశోధకులు అంటున్నారు.

కరోనా నిర్మూలన ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చన్న డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయంతో మనదేశంలోని పలు పరిశోధనా సంస్థలు కూడా ఏకీభవిస్తున్నాయి. అయితే ప్రజలంతా కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించడం, ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా.. దేశంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చంటున్నారు. మరో దశ ఉద్ధృతి చెలరేగకుండా అడ్డుకోవచ్చని.. ఇదే విషయం వివిధ దేశాల్లో నిరూపితమైందని పేర్కొన్నారు. విదేశాలకు కొవిడ్‌ టీకాలను మళ్లీ ఎగుమతి చేస్తామంటూ ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయడాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రశంసిస్తోంది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వయోధికులు, కరోనా ముప్పు అధికంగా ఉన్నవారికి టీకా అందిస్తూనే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ సమానంగా జరిగేలా చూడాలని కోరుతోంది. తద్వారా వైరస్‌లో కొత్త వేరియంట్లు ఉత్పన్నం కాకుండా కూడా చూడొచ్చని చెబుతోంది.