కోవిడ్-19 భూతం… దేశాలపై పడి ప్రతాపం చూపెడుతోంది. బిమారిలా వచ్చి మహమ్మారిలా మారిన ఈ వైరస్‌కి నేటికి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావకపోవటం దురదృష్టకరం. అయితే, దీనిని అంతమొందించేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే ఇటీవల భారత్‌లోని పవిత్ర గంగానది జలంతో వైరస్ నివారణకు వ్యాక్సిన్ కనుగొనవచ్చనే ప్రతిపాదన తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. గంగాజలంతో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టవచ్చేమో పరీక్షించాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ )కు ప్రతిపాదన చేసింది. కాగా, ఆ ప్రతిపాదనను ఐసీఎంఆర్ తిరస్కరించినట్లు సమాచారం.
గంగాజలంలో వ్యాక్సిన్ తయారు చేయాలని కేంద్రప్రభుత్వం ఏప్రిల్ 28న ఐసీఎంఆర్ కు ప్రతిపాదనలు పంపింది. కాగా, గంగాజలంపై క్లినికల్ పరిశోధన సాధ్యపడదని ఐసీఎంఆర్ చైర్ పర్సన్ గుప్తా స్పష్టం చేశారు. సైంటిఫిక్ డేటా తగు ఆధారాలు అవసరమని..ఏవీ లేకుండా చేయమని తేల్చిచెప్పారు. కాగా నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) అధికారులు ఇదివరకు గంగానది నీళ్ల ప్రత్యేక లక్షణాలు నాణ్యతపై పరిశోధనలు జరిపారు. గంగా నీటిలో బ్యాక్టీరియోఫేజ్ లు అధికంగా ఉంటాయని.. ఇందులో ఎటువంటి యాంటీ వైరల్ లక్షణాలు రుజువు కాలేదని సైంటిస్టులు తెలిపారు. అయినప్పటికీ దేశంలో నమ్మకం దృష్ట్యా ఇటువంటి ప్రతిపాదనలు ఐసీఎంఆర్ కు వస్తూనే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.