AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ప్రజలకు హెచ్చరిక: జిల్లాల్లో మొదలైన సెకండ్ వేవ్..?

గత రెండు వారాలుగా జిల్లాల్లో కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కానీ ఒక్కసారిగా నాలుగు జిల్లాల్లో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా ఏడాదిలోపు పసివాళ్లకు వైరస్ పాజిటివ్‌గా తేలటం...మరోవైపు..

తెలంగాణ ప్రజలకు హెచ్చరిక:  జిల్లాల్లో మొదలైన సెకండ్ వేవ్..?
Jyothi Gadda
|

Updated on: May 27, 2020 | 12:04 PM

Share

కోవిడ్-19: ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత మూడు నెలలుగా యావత్ ప్రపంచం కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తోంది. కరోనా భూతాన్ని కట్టడి చేసేందుకు పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా..దాదాపు అన్ని దేశాలు..ప్రజలు బయటకు రాకుండా అష్టదిగ్బంధనం చేసేశాయి. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. భారత్‌ కూడా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోనూ కరాళన‌ృత్యం చేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గత నాలుగైదు రోజులుగా అర్ధ సెంచరీ దాటి నమోదు అవుతున్నాయి. కొత్తగా ఏపీ, తెలంగాణ పల్లెలను కరోనా వెంటాడుతోంది.

తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1991కు చేరింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కనిపించింది. గత 15 -20 రోజులుగా జీహెచ్ఎంసీకే పరిమితమైన కరోనా మళ్లీ జిల్లాల్లో పంజా విసురుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి ద్వారా యాదాద్రి భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మంగళవారం 71 కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీలో 38, రంగారెడ్డి జిల్లాలో ఏడు, మేడ్చల్‌‌లో ఆరు, ఇతర రాష్ట్రాల నుంచి వలసల ద్వారా 12, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 4 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట, వికారాబాద్, నల్లగొండ, నారాయణపేట్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. మొన్నటి వరకు దాదాపుగా తెలంగాణలోని అన్ని జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నట్లే అని భావించిన ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు తాజాగా బయటపడుతున్న పాజిటివ్ కేసులు భయం కలిగిస్తున్నాయి.

గత రెండు వారాలుగా జిల్లాల్లో కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కానీ ఒక్కసారిగా నాలుగు జిల్లాల్లో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నారాయణపేట్‌ జిల్లా మక్తల్‌ మండలంలోని జక్లేర్‌లో నాలుగు నెలల బాలుడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఈ బాలుడిని రెండు రోజుల క్రితం మక్తల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత మహబూబ్‌నగర్‌ జనరల్‌ హాస్పిటల్‌కు పంపించారు. మళ్లీ అక్కడి నుంచి హైదరాబాద్‌ నిలోఫర్‌కు తీసుకెళ్లారు. అనుమానం వచ్చి ఆ చిన్నారికి మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని క్వారంటైన్‌కు తరలించారు.

అటు, వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఏడాది బాలుడికి కరోనా సోకింది. ఇటీవల బాలుడి తల్లిదండ్రులు షాద్‌నగర్‌లో జరిగిన ఓ విందులో పాల్గొన్నారు. విందుకు హాజరైన చిన్నారి మేనమామకు కరోనా సోకడంతో బాలుడికి కూడా వైరస్ సంక్రమించింది. ఇదే జిల్లాలో ఏడు నెలల వయసున్న మరో చిన్నారికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఇలా వరుసగా ఏడాదిలోపు పసివాళ్లకు వైరస్ పాజిటివ్‌గా తేలటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాల్లో విస్తరిస్తోన్న వైరస్ నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Follow Us