CORONA REMINDS: దశాబ్ధాలుగా నిర్లక్ష్యం అందుకు ఫలితమే ఈ విషాదం.. ఇకనైనా కళ్ళు తెరవాలంటున్న కరోనా

కరోనా కష్టకాలం పౌరుల్లో కొన్ని బాధ్యతలను గుర్తు చేస్తే.. ప్రభుత్వాధినేతలకు గత దశాబ్ధాలుగా చేసిన తప్పిదాన్ని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి కలిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో...

CORONA REMINDS: దశాబ్ధాలుగా నిర్లక్ష్యం అందుకు ఫలితమే ఈ విషాదం.. ఇకనైనా కళ్ళు తెరవాలంటున్న కరోనా
Corona Modi Medical Staff
Follow us
Rajesh Sharma

|

Updated on: May 19, 2021 | 6:40 PM

CORONA REMINDS RULERS ON MEDICAL INFRASTRUCTURE: కరోనా కష్టకాలం (CORONA PANDEMIC) పౌరుల్లో కొన్ని బాధ్యతలను గుర్తు చేస్తే.. ప్రభుత్వాధినేతలకు గత దశాబ్ధాలుగా చేసిన తప్పిదాన్ని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి కలిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) ఉధృతంగా వున్న తరుణంలో మరణాల సంఖ్య అందరినీ కలచి వేస్తోంది. ఆక్సిజన్ (OXYGEN) దొరక్క కొందరు, ఆసుపత్రిలో కనీసం బెడ్ దొరక్క మరికొందరు అసువులు బాస్తున్న దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతున్న పరిస్థితి. ఆంబులెన్సులను తమ రాష్ట్రాలకు ఎంటర్ కావద్దంటూ అడ్డుకుంటున్న పాలకులు పరోక్షంగా ప్రజల ప్రాణాలను హరిస్తున్నారనే చెప్పాలి. ఈ దుస్థితికి కారణం కేంద్రమని కొన్ని రాష్ట్రాలు (STATES) అంటుంటే.. రాష్ట్రాల అలసత్వమేనని కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT)లోని కొందరు అంటున్నారు. కేంద్రంలో గత ఏడేళ్ళుగా వున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం (NARENDRA MODI GOVERNMENT) కరోనాను నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ నేతలంటున్నారు. కానీ గత ఏడేళ్ళలో వైద్య రంగంలో వచ్చిన మార్పులు ఎంతో కొంత కనిపిస్తున్నాయి. కానీ అంతకు ముందే దాదాపు ఆరు దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలు (CONGRESS LEADERS) వైద్య రంగంలో ఎలాంటి పురోగతి చేయలేదన్న కఠోర సత్యాన్ని ప్రస్తుత కరోనా పాండమిక్ పీరియడ్ (PANDEMIC PERIOD) ఎండగడుతోంది.

నిజానికి గత ఏడేళ్ళలో వైద్య రంగంలో ఎంతో కొంత పురోగతి వుంది. అందుకు పెరిగిన వైద్య కళాశాలలే (MEDICAL COLLEGES) నిదర్శనం.. బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతీ వేయి, రెండు వేల మందికి ఓ గ్రాడ్యుయేట్ వైద్యుడు (GRADUATE MEDICO) అందుబాటులో వుంటే మన దేశంలో కనీసం 20 వేల జనాభాకు కూడా ఓ ఎంబీబీఎస్ డాక్టర్ (MBBS DOCTOR) లేని దుస్థితి. అందుక్కారణం దేశంలో వైద్య కళాశాలలను తగిన స్థాయిలో ఏర్పాటు చేయకపోవడమే. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతీ జిల్లా కేంద్రంలో 400 బెడ్ల ఆసుపత్రితోపాటు ఓ వైద్య కళాశాల వుండాలని నిర్దేశించారు. నిర్దేశిత ప్రమాణాలతో దరఖాస్తు చేసుకునే ప్రతి రాష్ట్రానికి కొత్త వైద్య కళాశాలను మంజూరు చేశారు. అందులో భాగంగానే తెలంగాణ (TELANGANA)లో గత ఆరేళ్ళలో సూర్యాపేట (SURYAPET), ఆదిలాబాదు (ADILABAD), నిజామాబాద్ (NIZAMABAD), సిద్దిపేట (SIDDIPET) వంటి పట్టణాలలో కొత్త వైద్య కళాశాలలు వెలిశాయి. నిజానికి దేశంలో రోగులకు కొరత లేదు. 140 కోట్ల జనాభాలో తరచూ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికంగానే వుంటుంది. పాలకుల్లో చిత్తశుద్ది వుంటే.. ప్రతీ జిల్లా కేంద్రంలోనే కాదు.. డివిజన్ కేంద్రాల్లోను 400 బెడ్ల ఆసుపత్రిని నెలకొల్పి దానికి అనుబంధంగా వైద్య కళాశాలను సాధించుకునే వీలుంది. కానీ.. ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గే పాలకులు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు నెలకొల్పేందుకు చిత్తశుద్దిని ప్రదర్శించరు. కానీ గత కొంత కాలంగా ట్రెండ్ మారింది. కరోనా కష్టకాలం ఆ ట్రెండ్‌కు మరింత ఊపునిచ్చింది. అందువల్లే తాజాగా తెలంగాణలో ఆరు వైద్య కళాశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగిత్యాల (JAGTIAL), సంగారెడ్డి (SANGAREDDY), మంచిర్యాల (MANCHIRIAL), కొత్తగూడెం (KOTTAGUDEM), వనపర్తి (WANAPARTY), మహబూబాబాద్ (MAHABUBABAD) పట్టణాలలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.

అయితే వైద్య విద్య (MEDICAL EDUCATION)పైనే దృష్టి సారిస్తేనే సరిపోతుందా? ఇలాంటి పాండమిక్ పరిస్థితిని ఎదుర్కోవడానికి అంతా సిద్దమైనట్లుగా భావించొచ్చా ? అంటే కాదనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. మనదేశంలోను పరిశోధనలకు కొదవేం లేదు. కానీ కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటై గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో బయటికి వస్తే.. వారి సంఖ్యకు అనుగుణంగా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు (POST GRADUATE COURSES), సీట్లు వుండాలి. స్పెషాలిటీ (SPECIALITY), సూపర్ స్పెషాలిటీ కోర్సులు (SUPER SPECIALITY COURSES) చేసేందుకు వారికి ప్రభుత్వం మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతోపాటు తగిన పారితోషికాలను అరేంజ్ చేయాలి.. అదే సమయంలో వైద్య రంగంలో పరిశోధనలకు ఇతోధికంగా ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

నిజానికి ప్రజారోగ్య రంగంలో మౌలిక వసతులను తగినంతగా అభివృద్ధి పరచకపోవడానికి 1947 నుంచి అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ కారణమేనని చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ (CONGRESS PARTY) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి. కాని ఈ వైఫల్యానికి ఇతర పార్టీలు కూడా ఎంతో కొంత బాధ్యత వహించక తప్పదు. పరస్పరం విమర్శించుకునే రాజకీయ క్రీడను పక్కన పెట్టి.. ఆత్మావలోకనం చేసుకోవాల్సిన పరిస్థితి కరోనా కారణంగా ఎదురవుతోంది. మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థది ఒకానొక విషాదకరమైన.. నిర్లక్ష్యపూరితమైన గాథ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఈ నిర్లక్ష్యానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రధాని నరేంద్రమోదీ ఏడేళ్ల పాలనలోనే ఇలా జరిగిందని చెప్పలేము. దశాబ్దాలుగా వైద్య రంగంపై కొనసాగిన నిర్లక్ష్యం ఫలితంగానే ప్రస్తుతం కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లను ఎదుర్కోలేక ప్రభుత్వ వ్యవస్థ చేష్టలుడిగి చూస్తోంది. ప్రస్తుత ప్రభుత్వాలు ఎంతో కొంత సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశంలో మరణాల విలయం ఎదురు కావడం లేదు కానీ.. లేకపోతే మరణాల సంఖ్య లక్షల్లో వుండేది. కరోనా ఫస్ట్‌ వేవ్‌ (CORONA FIRST WAVE) కూడా తీవ్రంగా విరుచుకుపడింది కానీ దాన్ని మనం కొన్ని అగ్రదేశాల కంటే కాస్త మెరుగైన రీతిలోనే ఎదుర్కోగలిగాం. కానీ ఆ తర్వాతే నిర్లక్ష్యం, అలసత్వం ఆవరించింది. 2021లో కరోనా సోకిన కేసులు, మరణాల రేట్లు ఇతరదేశాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని సంబరపడిపోయాం. ఆ తర్వాత సెకండ్‌ వేవ్‌ మరింత ప్రమాదకరమైన ప్రాణాంతకమైన మ్యూటెంట్‌ (MUTANT CORONA) రకాలతో విరుచుకుపడింది. అప్పటికే చాలీచాలని సౌకర్యాలతో, తక్కువ మంది వైద్య సిబ్బందితో కునారిల్లుతున్న ఆరోగ్య మౌలిక వసతుల కల్పనా రంగం దీని తాకిడిని ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WORLD HEALTH ORGANISATION) ప్రకారం, ఇప్పుడున్న అంబులెన్సుల కంటే అయిదు రెట్ల సంఖ్యలో అంబులెన్సులు భారత్‌ (BHARAT)కు అవసరమని తెలుస్తోంది.

అంబులెన్స్‌ సౌకర్యం లేక కార్లు, రిక్షాలలో కొన్ని చోట్ల సైకిళ్ళపై రోగులను తరలిస్తున్న దృశ్యాలు గత వారం వరకు మీడియాల విస్తృతంగా కనిపించాయి. కరోనా రోగులు శ్వాస సమస్యతో రొప్పుతూ, ఆసుపత్రిలో బెడ్‌ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నటువంటి హృదయ విదారకమైన దృశ్యాల వర్ణనలతో టీవీలు, సోషల్‌ మీడియా (SOCIAL MEDIA) మొన్నటి దాకా ముంచెత్తాయి. అనేకమంది ఆసుపత్రుల బయట అడ్మిషన్లు దొరక్క చనిపోయిన పరిస్థితి. కరోనా సెకండ్‌ వేవ్‌ (CORONA SECOND WAVE) కాలంలో ప్రపంచదేశాలన్నింటికంటే అధికంగా భారత్‌లోనే కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో మూడో వంతు భారత్‌లోనే సంభవించాయి. అయితే అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు అధికంగా వాస్తవ మరణాలు ఉంటున్నాయని కొందరంటున్నారు. ఈరోజుల్లో యావత్‌ ప్రపంచ దృష్టి భారత్‌మీదే కేంద్రీకృతమై ఉందంటే ఏమాత్రం ఆశ్చర్యపడాల్సింది లేదు. ఇంతవరకు మహమ్మారి పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో వైరస్‌ వ్యాపిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఏమిటి? గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉనికిలోనే లేని నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య వసతి కల్పన ఘోరంగా ఉంటోంది.

భారత్‌కు 73 సంవత్సరాల క్రితం స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు, ఆర్థిక, సామాజిక అభివృద్ధికోసం ప్రాధమ్యాలను దేశం నిర్ణయించుకోవలసి వచ్చింది. విషాదకరంగా ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అనే రెండు అత్యంత కీలకమైన రంగాలను ప్రారంభం నుంచి నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దేశంలో ఉన్నత విద్యారంగంలో ప్రపంచ స్థాయి బోధనా సంస్థలను నెలకొల్పారు. అద్భుతమైన ఆసుపత్రులను నిర్మించారు. కానీ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని ప్రాథమిక పాఠశాలలు లేవు. వైద్య క్లినిక్కులు (MEDICAL CLINICS), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ (PRIMARY HEALTH CENTRES) లేవు. దీని ఫలితంగానే ముఖ్యంగా బాలికల్లో అక్షరాస్యతా (LITERACY RATE) స్థాయి పడిపోయింది. అదేవిధంగా సగటు ఆయుర్దాయం కూడా పడిపోయింది. మంచి ప్రజారోగ్య సంరక్షణకు ఇదే అసలైన సూచిక. చైనా (CHINA), చివరకు ముస్లిం దేశమైన ఇండోనేషియా (INDONESIA) వంటి అతిపెద్ద దేశాలు కూడా తమ ప్రాధమ్యాలను సరైన విధంగా నిర్ణయించుకున్నాయి. ఇవి తొలి నుంచీ ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత నిచ్చాయి. ఈ రెండు దేశాల్లోనూ 1947 నాటికి భారత్‌ కంటే తక్కువ అక్షరాస్యతను, తక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉండేవి. కానీ 1980లలో ఈ రెండు కీలక రంగాల్లో ఈ దేశాలు అవలీలగా భారత్‌ని దాటి ముందుకెళ్లిపోయాయి.

ప్రజారోగ్య మౌలిక వసతులను తగినంతగా నిర్మించడంలో వైఫల్యానికి 1947 నుంచి అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ కారణమే. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి. కాని ఈ వైఫల్యానికి ఇతర పార్టీలు కూడా ఎంతో కొంత బాధ్యత వహించక తప్పదు. అత్యంత ప్రముఖ, అగ్రశ్రేణి సంస్థలు సైతం కాలం గడిచేకొద్దీ నిర్వహణాలోపం, అవినీతి కారణంగా ప్రమాణాలు దిగజార్చుకుంటూ వచ్చాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ (HIMACHAL PRADESH)లోని ఒక చిన్న హిల్‌ స్టేషన్‌ అయిన కసౌలీ (KASOULI)లో 1904లోనే కేంద్ర పరిశోధనా సంస్థను నెలకొల్పారు. ఇది ఒకప్పుడు పలు రకాల వ్యాక్సిన్ల తయారీదారుగా పేరుకెక్కింది. వీటిలో కొన్నింటిని ఎగుమతి కూడా చేసేవారు.

ప్రభుత్వ నిర్వహణలో ఆధునిక ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ఆధునిక, హేతుపూర్వకమైన శాస్త్రీయ దృక్పథం చాలా అవసరం. కానీ ఇప్పుడు జ్యోతిష శాస్త్రానికి సైన్సు స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పైగా ప్రత్యామ్నాయ వైద్యాన్ని అలోపతి కంటే ఆధిక్యతా స్థానంలో ఉంచాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో శాస్త్రీయ, వైద్య ఆవిష్కరణల పేరిట సెమినార్లు ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి ఆవు విసర్జించే వ్యర్థ పదార్ధాలను కేన్సర్‌ వంటి కీలక వ్యాధులకు కూడా ఉపశమన కారులుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి మూఢ విశ్వాసాలు దేశంలో చలామణీ అవుతున్నప్పుడు, సమర్థవంతమైన, ఆధునిక ఆరోగ్య మౌలిక వసతులను మనం ఏర్పర్చుకోగలమా? శాస్త్రీయ దృక్పథాన్ని, మానవవాదాన్ని, ప్రశ్నించి సంస్కరించే స్ఫూర్తిని అభివృద్ధి పర్చుకోవడం ప్రతి పౌరుడి విధి అని రాజ్యాంగమే నిర్దేశించింది. సైన్స్ (SCIENCE), ఔషధ రంగం (PHARMA SECTOR)లో భవిష్యత్తులో నిర్వహించే ప్రతి సమావేశంలోనూ భారత రాజ్యాంగం ప్రవచించిన ఈ విశిష్ట వాక్యాన్ని ప్రముఖంగా పొందుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ALSO READ: కరోనా సెకెండ్ వేవ్ వర్రీ నుంచి విముక్తి కలిగించే గుడ్ న్యూస్ వచ్చేసింది..!

ALSO READ: ఛాలెంజింగ్ ధోరణి.. అంతలోనే సంధి.. ఆ వెంటనే అమీతుమీ.. అసలు ఈటల వ్యవహారంలో జరిగిందిదే !

ALSO READ: ప్రెసిడెంట్ బైడెన్ సరికొత్త వ్యూహం.. ఆ చర్యల వెనుక అదే లక్ష్యం!