లక్షలాది డీఎన్ఏల సేకరణలో చైనా ! ఎందుకు ?
కరోనా వైరస్ కి మూలం చైనాయే నని ప్రపంచ దేశాలు వేలెత్తి చూపుతున్న వేళ.. ఓ కొత్త ప్రయోగానికి ఈ దేశం శ్రీకారం చుట్టింది. లక్షలాది ప్రజల డీఎన్ఏ నమూనాల సేకరణలో బీజింగ్ తలమునకలైందని..
కరోనా వైరస్ కి మూలం చైనాయే నని ప్రపంచ దేశాలు వేలెత్తి చూపుతున్న వేళ.. ఓ కొత్త ప్రయోగానికి ఈ దేశం శ్రీకారం చుట్టింది. లక్షలాది ప్రజల డీఎన్ఏ నమూనాల సేకరణలో బీజింగ్ తలమునకలైందని నిపుణులు అనుమానిస్తున్నారు. జన్యు నిఘా (జెనెటిక్ సర్వేలెన్స్)కోసం ఓ సాధనాన్ని (టూల్) లేదా వ్యవస్థను డెవలప్ చేసే యత్నంలో భాగంగా దేశ వ్యాప్తంగా 35 మిలియన్ల నుంచి 70 మిలియన్ల మంది మగవారి డీ ఎన్ ఏ శాంపిల్స్ సేకరణలో నిమగ్నమై ఉందని వారు భావిస్తున్నారు. తమ దేశాన్ని హైటెక్ సర్వేలెన్స్ దేశంగా తయారు చేయాలన్నదే అధికారుల లక్ష్యమని, అందుకే బృహత్తర జన్యు సంబంధ డేటాను రూపొందించడానికి యత్నిస్తోందని అంటున్నారు. టొరంటో యూనివర్సిటీలో పీ హెచ్ డీ చేస్తున్న విద్యార్ధి మిలే డి ర్క్స్ తో బాటు చైనాలోని జాతి సమస్యలపై పరిశోధన చేసే జేమ్స్ లీ బోల్డ్ అనే నిపుణుడు కూడా ఈ మేరకు తమ అభిప్రాయాలను న్యూయార్క్ టైమ్స్ లో రాసిన ఓ ఆర్టికల్ లో వెల్లడించారు.
చైనాలో అసమ్మతి అన్నది నేరమని, అణచివేత చర్యల్లో పోలీసుల ‘ఆపరేషన్స్’ చాలా కీలకమని వీరు పేర్కొన్నారు. డీ ఎన్ ఏ నమూనాల సేకరణవల్ల పోలీసుల రిపోర్టులో సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నప్పుడు ఆయా వ్యక్తుల నేర చరిత్ర స్పష్టంగా తెలిసిపోతుందని చైనా అధికారులు భావిస్తున్నారట.. టిబెట్ వంటి ప్రాంతాలతో సహా అనేక చోట్ల మైనారిటీ జాతులను ‘కంట్రోల్’ లో ఉంచడానికి ఈ టూల్ ని చైనా వినియోగించవచ్చునని భావిస్తున్నారు. అయితే ఇలాంటి ‘ప్రోగ్రాం’ ఏదీ తాము చేపట్టలేదని చైనా ప్రభుత్వం కొట్టి పారేస్తోంది.