పీఎం కేర్స్ ఫండ్ పై ‘సుప్రీం’ లో పిల్.. తీర్పును రిజర్వ్ లో ఉంచిన కోర్టు
కోవిద్ పై పోరుకు ఉద్దేశించిన పీ ఎం కేర్స్ ఫండ్ ను కేంద్రం సుప్రీంకోర్టులో సమర్థించుకుంది. ఇది కరోనా వైరస్ ని ఎదుర్కొనడానికి స్వఛ్చందంగా అందే విరాళాల సేకరణ కోసం ఉద్దేశించినదని తెలిపింది. అంతే తప్ప..
కోవిద్ పై పోరుకు ఉద్దేశించిన పీ ఎం కేర్స్ ఫండ్ ను కేంద్రం సుప్రీంకోర్టులో సమర్థించుకుంది. ఇది కరోనా వైరస్ ని ఎదుర్కొనడానికి స్వఛ్చందంగా అందే విరాళాల సేకరణ కోసం ఉద్దేశించినదని తెలిపింది. అంతే తప్ప.. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లేదా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లకు కేటాయించిన నిధులకు, దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. కోవిద్ పాండమిక్ సమయంలో అత్యవసరంగా వినియోగించేందుకు ఉద్దేశించిన నిధులు లేదా విరాళాల కోసం దీన్నిఏర్పాటు చేసినట్టు కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పీ ఎం కేర్స్ ఫండ్ నిధులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లేదా స్టేట్ ఫండ్ లకు బదిలీ చేయాలని కోరుతూ ఓ స్వఛ్చంద సంస్థ దాఖలు చేసిన ‘పిల్’ ను కోర్టు విచారించింది. ఆ రెండు సంస్థల నిధులను ఈ ట్రస్ట్ ‘ముట్టుకోదని’ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ ఫండ్ కు ప్రధాని ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఉండగా రక్షణ, హోం, ఆర్థిక శాఖల మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్.కె.పాల్, ఎం.ఆర్.షా లతో కూడిన ధర్మాసనం ఈ పిల్ పై తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది.