Covaxin: భారత్ బయోటెక్‌కు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు.. త్వరలో కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ లిస్టింగ్‌లో చేర్చే ఛాన్స్!
భారత్ బయోటెక్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి శుభవార్త అందింది. కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ జాబితా(ఈయూఎల్)కు అనుమతించే పత్రాలు సమర్పించేందుకు అంగీకరించింది.
WHO Meets Bharat Biotech Over Covaxin: తొలి స్వదేశీ టీకా కొవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటెక్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి శుభవార్త అందింది. కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ జాబితా(ఈయూఎల్)కు అనుమతించే పత్రాలు సమర్పించేందుకు అంగీకరించింది. ఈనెల 23న కొవాగ్జిన్‌కు సంబంధించిన పూర్తి డేటా వివరాలు అందజేసేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఇది కొవాగ్జిన్ టీకాపై పూర్తిస్థాయి సమీక్ష సమావేశం కాదని, వ్యాక్సిన్ మొత్తం డేటా సమర్పించేందుకు ఉద్దేశించిన భేటీగా డబ్ల్యూహెచ్‌ఓ వర్గాలు తెలిపాయి. కొవాగ్జిన్ అత్యవసర వినియోగ లిస్టింగ్‌కు డబ్ల్యూహెచ్‌ఓ నుంచి జులై లేదా సెప్టెంబర్‌లో అనుమతి లభించవచ్చని భారత్ బయోటెక్ గతనెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం.. ఏదేని కొత్త లేదా లైసెన్స్ పొందని ఉత్పత్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతించే ప్రక్రియను ఈయూఎల్‌గా పరిగణిస్తారు. డబ్ల్యూహెచ్‌ఓ నుంచి దీనికోసం అనుమతి పొందేందుకు ఇప్పటికే 90 శాతం దస్త్రాలు సమర్పించినట్లు భారత్ బయోటెక్ గత నెలలో జరిగిన సమావేశంలో కేంద్రానికి వెల్లడించింది. మిగతా డేటాను జూన్‌లో సమర్పించనున్నట్లు తెలిపింది.
The news reports on Bharat Biotech submitting Phase-3 data to WHO is incorrect and lacks any evidence.
— BharatBiotech (@BharatBiotech) June 17, 2021
మరోవైపు, కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో కోవిడ్ టీకాల పంపిణీ చురుగ్గా కొనసాగుతోంది. అనేక చోట్ల భిన్న రకాల కంపెనీలకు చెందిన కోవిడ్ టీకాలను ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లోనూ కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను వేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో స్పుత్‌నిక్, బయోలాజికల్-ఇ టీకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కంపెనీలకు చెందిన టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొవాగ్జిన్ అత్యవసర వినియోగ లిస్టింగ్‌కు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతించలేదు. తాజాగా అహ్వానం అందడటంతో త్వరలోనే కొవాగ్జిన్ కూడా ఆ జాబితాలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.