Career Opportunity: సాఫ్ట్‌వేర్‌లోనే కాదు.. దీనిలో కూడా రూ. లక్షల్లో జీతాలు.. కెరీర్‌ను ఇలా ప్లాన్ చేసుకోండి..
చాలా మందికి అసలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అంటే ఏమిటో కూడా తెలీదు. మీరు వారిలో ఒకరు అయితే ఈ కథనం మీకోసమే. అసలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అంటే ఏమిటి? ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ గా మారాలంటే ఏం కోర్సులు చేయాలి? దానితో కెరీర్ ఎలా ఉంటుంది? జీతం ఎలా ఉంటుంది? ఈ కోర్సును ఆఫర్ చేసే టాప్ కాలేజీలు ఏమిటి?
బ్యాంకింగ్ రంగంలో కొలువుల కోసం చాలా మార్కెట్లో చాలా పోటీ ఉంటుంది. అభ్యర్థులు ఏళ్లకు ఏళ్లు తర్ఫీదు పొందుతూ ఏదైనా బ్యాంక్ కొలువు సాధించాలని తాపత్రయపడుతుంటారు. అయితే క్లర్క్, పీవో వంటివి ఉద్యోగాలే అందరికీ పరిచయం ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో మరో బ్యాంకింగ్ కు సంబంధించిన ఓ కొత్త విధానం అత్యంత ఆదరణ పొందుతోంది. అదే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్. ఇది కొత్త విధానం కాకపోయినప్పటికీ ఇటీవల కాలంలో ఎక్కువ మంది దీనిని కెరీర్ గా మలచుకుంటున్నారు. అయితే చాలా మందికి అసలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అంటే ఏమిటో కూడా తెలీదు. మీరు వారిలో ఒకరు అయితే ఈ కథనం మీకోసమే. అసలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అంటే ఏమిటి? ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ గా మారాలంటే ఏం కోర్సులు చేయాలి? దానితో కెరీర్ ఎలా ఉంటుంది? జీతం ఎలా ఉంటుంది? ఈ కోర్సును ఆఫర్ చేసే టాప్ కాలేజీలు ఏమిటి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అంటే..
మీరు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కెరీర్ గా ఎంచుకునే ముందు దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరం. అసలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అంటే ఏమిటో మొదట తెలుసుకోవాలి. సాధారణ బ్యాంకింగ్ కు పూర్తి భిన్నంగా.. కేవలం పెట్టుబడుల కు సంబంధించి ఏర్పాటు చేసే ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ద్వారా కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు, ప్రభుత్వాలకు మూలధనం, పెట్టుబడి సమకూర్చే పనులు చేసిపెడుతుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు సంబంధించిన సెక్యూరిటీ ల విక్రయం, కొనుగోలు, వివిధ మార్గాల్లో నిధుల సమీకరణ, రుణాల మంజూరు మార్గాల అన్వేషణ, వాటి ఏర్పాటు వంటి విభిన్న అంశాలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పరిధి లోకి వస్తాయి.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు ఏమి చేస్తారు..
ఇతర కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల అంశంలో సలహాలు, సూచనలు ఇవ్వటం, కంపెనీ విలువ మదింపు చేయటం వంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. చాలా మట్టుకు సంప్రదాయ బ్యాంకులు ఈ పనులు చేయవు. కాబట్టి, వాటిలోనే ఒక విభాగాన్ని పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కోసం నియమించటం లేదా ఒక ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసి, తద్వారా ఈ విభాగంలో సేవలు అందించటం చేస్తుంటాయి. తాము ఇచ్చిన సేవలకు తమ క్లయింట్ల వద్ద సేవా రుసుము తీసుకుంటాయి.
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా మారాలంటే..
ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ లేదా ఆర్కిటెక్చర్ వంటి వాటికి ప్రత్యేకమైన కోర్సు ఉన్నట్లు.. ఒక వ్యక్తి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా మారేందుకు నిర్దిష్ట కోర్సు ఏదీ లేదు. ఏ డొమైన్ నుండి వచ్చిన వ్యక్తి అయినా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ కావచ్చు. అయితే కొన్ని ఆర్థిక సంబంధిత ప్రాథమిక అంశాలపై అవగాహన, కఠినమైన శిక్షణ కావాలి. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అవడానికి ప్రత్యేకమైన కోర్సు ఏది లేనప్పటికీ కొన్ని అంశాలపై సునిశిత శిక్షణ, నైపుణ్యం అవసరం. అందుకు ఉపయుక్తమయ్యే కోర్సులు ఇప్పుడు చూద్దాం..
- ప్రాథమిక అకౌంటింగ్ నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన
- దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై అవగాహన
- స్టాక్ మార్కెట్లు, నిబంధనలు, కార్పొరేట్ చట్టాలు, అంతర్జాతీయ చట్టాలు మొదలైన వాటిపై కనీస అవగాహన
- వివిధ స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్‌లో చురుకుగా పాల్గొంటే అందుకు అవసరమైన లైసెన్స్‌లు
- క్లయింట్‌లతో చక్కగా మాట్లాడేందుకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్
- రిస్క్ అసెస్‌మెంట్ కోసం చురుకైన ఆప్టిట్యూడ్
ఈ కోర్సులు మీకు సాయం చేస్తాయి..
కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ (బీ.కామ్), ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ (గణితం తప్పనిసరి కానప్పటికీ, విస్తృతమైన విశ్లేషణ కారణంగా, కంపెనీలు మరియు కళాశాలలు కూడా గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో గణితాన్ని అభ్యసించిన వ్యక్తుల కోసం ఆసక్తి చూపుతున్నాయి) చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌లు వంటి వృత్తిపరమైన కోర్సులు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో కెరీర్ కోసం అవసరమైన విషయాలను ముందుగానే తెలియజేస్తాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మేనేజ్‌మెంట్‌ల,ఫైనాన్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ తరచుగా టాప్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థలకు అవసరమవుతాయి.
కెరీర్ ఎలా ఉంటుంది..
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అనేది ఏదైనా డిగ్రీ లేదా పీజీ అయిపోగానే వచ్చే ఉద్యోగం కాదు. దీనికి అనుభవం, అవగాహన వంటివి అవసరం. ఫైనాన్స్ రంగంలో పనిచేస్తూ అవసరమైన స్కిల్స్ ని వృద్ధి చేసుకుంటే అది మిమ్మల్ని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ గా మార్చుతుంది. రిటైల్ బ్యాంకుల ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ బ్రాంచ్‌లలో, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌లలో లేదా స్టాక్ బ్రోకర్ల వద్ద ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు అవసరం అవుతారు. చాలామంది రీసెర్చ్ అసోసియేట్స్ గా కెరీర్ ప్రారంభిస్తారు. కొందరు సేల్స్, మార్కెటింగ్ డివిజన్, క్లయింట్ రిలేషన్షిప్ మేనేజర్ లేదా వెల్త్ మేనేజర్‌లతో కూడా ఉంటారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ కావాలనుకునే వ్యక్తులు ఫైనాన్స్‌లో అగ్రశ్రేణి సంస్థ నుండి ఎంబీఏ చేస్తే ప్రయోజనం ఉంటుంది.
జీతం ఎంత ఉంటుంది..
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ జీతం ఆ వ్యక్తి అనుభవం, నైపుణ్యం వంటి ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మన దేశంలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లకు సంవత్సరానికి రూ. 3 లక్షల నుండి రూ. 24 లక్షల వరకు ఉంటుంది. సగటున రూ. 13.44 లక్షలు ఉంటుంది.
వీటిల్లో ఉద్యోగాలు..
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. గోల్డ్మన్ సాచ్స్ , మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్ ఛేజ్, బ్యాంకు అఫ్ అమెరికా మెర్రిల్ లించ్, డాయిష్ బ్యాంకు వంటి అగ్రగామి సంస్థలు ఉన్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే… ఇక్కడ కూడా గ్లోబల్ కంపెనీల స్థానిక బ్రాంచీలు సేవలు అందిస్తుంటాయి. కానీ, పూర్తిగా భారతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు కూడా పనిచేస్తున్నాయి. ఎస్ బీ ఐ కాపిటల్ మర్కెట్స్, రెలిగేర్ కాపిటల్ మర్కెట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు, ఎస్ ఎం సి క్యాపిటల్స్, ఐ డి బి ఐ కాపిటల్ మార్కెట్ సర్వీసెస్ వంటి ప్రముఖ సంస్థలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఉద్యాగాలు అందిస్తున్నాయి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..