Bill Gates: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి 2 రోజులే పనిదినాలు.. బిల్ గేట్స్ చెబుతున్న లెక్క..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవ జీవన విధానంలో భారీ స్థాయిలో మార్పులను తీసుకురాబోతోంది. ఈ సందర్భంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. రాబోయే దశాబ్దంలో ఏఐ ప్రభావంతో వారానికి పని రోజులు కేవలం రెండు రోజులకు తగ్గుతాయని ఆయన ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. ఇంతకీ ఆయనేమంటున్నాడంటే..

బిల్ గేట్స్ చేసిన తాజా వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. జిమ్మీ ఫాలన్ నిర్వహించే ‘ది టునైట్ షో’లో బిల్ గేట్స్ మాట్లాడుతూ, “ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును గమనిస్తే, భవిష్యత్తులో కార్మికులు వారానికి రెండు లేదా గరిష్టంగా మూడు రోజులు పని చేస్తే చాలు. మరో పదేళ్లలో ఏఐ వినియోగం అమాంతం పెరిగి, అనేక పనులు సులభంగా, త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది,” అని ఆయన వివరించారు.
పనిచేయడమే జీవిత లక్ష్యం కాదు..
ఇటీవల ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 గంటల పని అవసరమని పేర్కొనగా, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యం 90 గంటల పని గురించి సూచించారు. ఈ నేపథ్యంలో గేట్స్ వ్యాఖ్యలు మరింత దృష్టిని ఆకర్షించాయి. గతంలోనూ గేట్స్ తక్కువ పని దినాల గురించి మాట్లాడారు. చాట్ జీపీటీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు, వారానికి మూడు రోజుల పని సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. “మన జీవిత లక్ష్యం కేవలం పని చేయడం మాత్రమే కాదు,” అని ట్రెవర్ నోహ్ యొక్క ‘వాట్ నౌ?’ పాడ్‌కాస్ట్‌లో ఆయన స్పష్టం చేశారు.
అక్కడ నాలుగు రోజులే పని..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పని దినాల సంఖ్య తగ్గడం వల్ల ఉత్పాదకతలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఒక రోజు పని తగ్గితే ఉత్పాదకత సుమారు 24% పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జపాన్‌లో తగ్గుతున్న జనన రేటును అరికట్టేందుకు టోక్యో ప్రభుత్వం నాలుగు రోజుల వారపు పనిని ప్రవేశపెట్టిన సంగతి గమనార్హం. అలాగే, జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమన్ కూడా మూడున్నర రోజుల పని వారం గురించి సానుకూలంగా స్పందించారు.
ఏఐతో సాధ్యమే..
ఏఐ అనేక రంగాలను పూర్తిగా మార్చేస్తోంది. వైద్యులు, ఉపాధ్యాయుల వంటి వృత్తులను ఏఐ భర్తీ చేసే సాధ్యత ఉందని గేట్స్ భావిస్తున్నారు. అయితే, క్రీడలు మాత్రం మానవులకే పరిమితమవుతాయని ఆయన అంటున్నారు. తయారీ, వ్యవసాయం, రవాణా వంటి రంగాల్లో ఏఐ ఆధిపత్యం చెలాయిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
7 రోజుల పని 2 గంటల్లోనే..
లింక్డ్‌ఇన్ నివేదిక ప్రకారం, 2025 నాటికి ఏఐ అక్షరాస్యత అత్యంత కీలకమైన నైపుణ్యంగా మారనుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యక్తులు తమ ఆలోచనలను సిద్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు సలహా ఇస్తున్నారు. మొత్తంగా, ఏఐ రాబోయే రోజుల్లో పని విధానాలను సమూలంగా మార్చివేస్తుందని బిల్ గేట్స్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. వారానికి ఏడు రోజుల పని కేవలం రెండు రోజుల్లో పూర్తయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మార్పు కార్మికులకు ఎక్కువ విశ్రాంతి సమయాన్ని అందించడమే కాక, వారి పని సామర్థ్యాన్ని కూడా పెంచవచ్చు. అయితే, ఈ సాంకేతికత వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందా అనేది ఇంకా చూడాల్సి ఉంది.