విద్యార్థులకు వాట్సప్ సేవలు.. ఇకపై మీసేవ చుట్టూ తిరగాల్సిన పనేలేదు!
రాష్ట్రంలో డిజిటల్ పాలనకు మరో అడుగు పడింది. ఇకపై విద్యార్థులు అత్యవసర విద్యా పత్రాలు కోసం మీసేవా కేంద్రాల ఎదుట క్యూల్లో నిలబడాల్సిన పనిలేదు. వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు… మీ అవసరమైన డాక్యుమెంట్లు మీ ఫోన్‌లోనే చిటికెలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు..

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ పాలనకు మరో అడుగు పడింది. ఇకపై విద్యార్థులు అత్యవసర విద్యా పత్రాలు కోసం మీసేవా కేంద్రాల ఎదుట క్యూల్లో నిలబడాల్సిన పనిలేదు. వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు… మీ అవసరమైన డాక్యుమెంట్లు మీ ఫోన్‌లోనే చిటికెలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. విద్యార్థులకు ప్రత్యేకమైన సాయం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఒక్క మెసేజ్‌తో హాల్ టికెట్లు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ ఇప్పుడు 8096958096 అనే వాట్సాప్ నంబర్ ద్వారా ఎప్పుడైనా 24 గంటలు, వారంలో ఏడు రోజుల పాటు…హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వీలు ఉంటుంది. SSC, ఇంటర్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పోటీ పరీక్షలు… ఏ పరీక్షకు అయినా కావాల్సిన హాల్ టికెట్ ఒక మెసేజ్ దూరంలోనే అందుబాటులో ఉంటుంది. మీసేవ, మెటా కలసి తీసుకొచ్చిన ఈ సేవలతో మొత్తం 38 శాఖలకు చెందిన 580కి పైగా సేవలు వాట్సాప్ ద్వారా విద్యార్థుల ముందుకు రానుండటం విశేషం.
ఇంకా మరెన్నో సేవలు
వాట్సాప్ ఆధారిత మీసేవా సేవలను మరింత యాక్సెస్ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో ఈ సర్వీస్‌ను తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాదు.. వాయిస్ కమాండ్ ఫీచర్‌ను కూడా డెవలప్ చేస్తున్నారు. దీని ద్వారా ఫోన్‌ను తాకకుండా సేవలు పొందే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని శాఖలను ఈ ప్లాట్‌ఫారమ్‌కు చేర్చి సేవలను విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








