Inter Exams 2025: ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన సర్కార్! ఇక ఆ భయం లేనట్లే..
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే విద్యార్ధులు పరీక్ష కేంద్రాల్లోకి వచ్చేముందు సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు చేతి వాచ్‌లు కూడా బయటే వదిలేసి రావాలని, వాటితో పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని ఇంటర్ బోర్డు ఆంక్షలు పెట్టింది. దీంతో విద్యార్ధులు సమయం తెలియక పరీక్షలను సరిగ్గా రాయలేకపోతున్నట్లు..

హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే విద్యార్ధులు పరీక్ష కేంద్రాల్లోకి వచ్చేముందు సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు చేతి వాచ్‌లు కూడా బయటే వదిలేసి రావాలని, వాటితో పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని ఆంక్షలు పెట్టింది. దీంతో ఇంటర్ పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థుల స్మార్ట్, రిస్ట్ వాచ్‌లను అనుమతించలేదు. తొలి రోజు నుంచే విద్యార్ధులు చేతికి వాచ్‌లు లేకుండానే పరీక్షలకు హాజరవుతున్నారు. మరోవైపు అధికారులు సమయాన్ని సూచిస్తూ అర గంటకు ఒకసారి గంట కొడతారని, ఇన్విజిలేటర్లు కూడా సమయం చెబుతారని ఇటీవల బోర్డు కార్యదర్శి ప్రకటించారు.
అయితే రాష్ట్రంలో చాలా చోట్ల ఈ విధానాన్ని పాటించలేదని ఫిర్యాదులు వచ్చాయి. సమయం తెలియక విద్యార్థులు ఆందోళన చెందారు. సమయం తెలియక పరీక్షలను సరిగ్గా రాయలేకపోయామని పలువురు విద్యార్థులు తమ తల్లితండ్రులకు చెప్పడంతో వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలను ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. సోమవారం పరీక్ష ప్రారంభమయ్యే నాటికి అన్ని కేంద్రాల్లోని గదుల్లో గడియారాలు సిద్ధం చేయాలని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య జిల్లాల ఇంటర్ అధికారులను శనివారం ఆదేశించారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,532 ఇంటర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ బోర్డు తాజా నిర్ణయంతో అన్ని కేంద్రాల్లోని పరీక్ష గదుల్లో గోడ గడియారాలను ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు కృష్ణ ఆదిత్య శనివారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారుల (డీఐఈఓ)కు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో గోడ గడియారం కొనుగోలుకు రూ.100 చొప్పున మంజూరు చేశామని ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే వాల్ క్లాక్ రూ.100కు రాదని, మరికొంత సొమ్ము చెల్లించి అధికారులే గడియారాలు కొని పరీక్షా కేంద్రాలకు సరఫరా చేయాలని పలువురు ఇంటర్ బోర్డును కోరారు. కాగా తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 20 వరకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజూ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




