Telugu News » Career jobs » Telangana BIE decided to conduct Practicals for 20 marks in English subject from next academic year
TSBIE: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్! వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్.. కీలక మార్పులు ఇవే..
Srilakshmi C |
Updated on: Nov 12, 2022 | 12:01 PM
వచ్చే విద్యాసంవత్సరం (2023-24) నుంచి ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ 20 శాతం మార్కులకు ప్రాక్టికల్స్‌కు కేటాయించి, రాత పరీక్షను 80 మార్కులకే పరిమితం చేస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు పేర్కొంది. విద్యార్థుల్లో ఇంగ్లిష్..
TS Inter Board key decisions
వచ్చే విద్యాసంవత్సరం (2023-24) నుంచి ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ 20 శాతం మార్కులకు ప్రాక్టికల్స్‌కు కేటాయించి, రాత పరీక్షను 80 మార్కులకే పరిమితం చేస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు పేర్కొంది. విద్యార్థుల్లో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచేందుకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ప్రాక్టికల్స్‌ను అమలు చేస్తామని చెప్పింది. అయిదేళ్ల (2017) తర్వాత శుక్రవారం (నవంబరు 11) జరిగిన ఇంటర్‌బోర్డు పాలకమండలి సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో ఇంటర్ బోర్డు ఛైర్మన్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్ బోర్డు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఇప్పటివరకు ఎంఈసీ, ఎంపీసీ గ్రూపునకు ఒకే స్థాయి గణితం ఉంది. ఎంపీసీకి ఉన్నంత కఠినంగా ఎంఈసీ విద్యార్థులకు గణితం ఉండాల్సిన అవసరం లేదని, కామర్స్‌కు తగ్గట్లు సిలబస్‌లో మార్పులు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం.
ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించింది.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గృహ, వాణిజ్య సముదాయాల్లోని( మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ) ప్రైవేట్ కళాశాలలకు ఒకటీ రెండేళ్ల పాటు అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ నుంచి మినహాయింపు ఇవ్వాలని భావించింది.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజులో మార్పులేదు.
ద్వితీయ భాష సబ్జెక్టులైన తెలుగు, హిందీ, ఉర్దూలకు ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ మూల్యాంకనం ప్రారంభం. ఆఫ్‌లైన్‌లోనూ పరిశీలించి లోటుపాట్లను సరిదిద్ది వచ్చే సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలు.
ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా నీట్, కామన్ లా అడ్మిషన్ టెస్టు(క్లాట్) తదితర పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా సిలబస్ రూపొంచింటం.
2023-24లో ప్రథమ, 2024-25లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ద్వితీమ భాష సబ్జెక్టుల సిలబస్‌లో మార్పు.
ఇంటర్‌బోర్డులో ఖాళీగా ఉన్న 52 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ.
ఇకపై కామర్స్‌ను కామర్స్ అండ్ అకౌంటెన్సీగా పిలుస్తారు.
ప్రత్యేక అవసరల విద్యార్థులకు పాస్ మార్కులను.. 20 మార్కులకు తగ్గింపును ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు.
అనుబంధ గుర్తింపు పొందని కళాశాలల్లోని విద్యార్థులను ‘ప్రైవేట్’గా పరీక్షలు రాయించే అంశాన్ని బోర్డు తిరస్కరించింది. ఆ విధానంలో బైపీసీ చదివే విద్యార్థులకు నీట్ రాసేందుకు అర్హత ఉండదని, ప్రాక్టికల్స్ చేయడం కూడా సమస్య అవుతుందని బోర్డు భావించినట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వ అనుమతి లేకుండా కాలేజీలను ఒక చోట నుంచి మరో చోటకు తరలించినా, అధిక సెక్షన్లు ప్రవేశపెట్టినా ఇప్పటివరకు ఉన్న జరిమానాను మూడు రెట్లు పెంచేందుకు బోర్డు ఆమోదించింది.