Scholarship: ఆ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఈ కేంద్ర పథకం ద్వారా ఫ్రీ స్కాలర్‌షిప్.. వివరాలు ఇవిగో..
ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు తమ చదువులను..
ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు తమ చదువులను మధ్యలోనే వదిలేయాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి యశస్వి స్కాలర్‌షిప్ యోజన’ పధకాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ స్కాలర్‌షిప్ పథకం కింద 9, 11 తరగతుల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం రూ.75 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడమే కాదు.. వారి బస నుంచి భోజనం ఏర్పాటు వరకు ఉచితంగా అందజేస్తోంది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో నివసించే రైతులు, నిరుపేదలు, అణగారిన కుటుంబాలకు విద్య అందేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.
ప్రధాన్ మంత్రి యశస్వి స్కాలర్‌షిప్ పథకం ఇప్పటివరకు అతిపెద్ద స్కాలర్‌షిప్ పథకాలలో ఒకటి. దీని కింద 9 నుంచి 10వ తరగతిలోకి వెళ్లే విద్యార్థులకు సంవత్సరానికి రూ.75,000 ఉపకార వేతనం అందనుండగా.. మొదటి సంవత్సరం నుంచి రెండో సంవత్సరం ఇంటర్మీడియట్‌లోకి వెళ్లేవారికి 1 లక్ష 25 వేల స్కాలర్‌షిప్ ఇస్తారు. ఇందుకోసం విద్యార్థులు ముందుగా ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలి. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత మాత్రమే విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అర్హులు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే వదిలేయాల్సిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
ప్రధానమంత్రి యశస్వి యోజనకు అర్హతలు..
ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి, విద్యార్థి తప్పనిసరిగా భారతదేశానికి చెందినవాడై ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలకు మించకూడదు, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మాత్రమే ఈ పధకం ప్రయోజనం ఉంటుంది. స్కాలర్‌షిప్ నేరుగా బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత, స్కాలర్‌షిప్ ఫారమ్‌ను మళ్లీ నింపాలి. ఆ ఫారమ్‌తో పాటు బ్యాంకు పాస్‌బుక్ ఫోటోకాపీని జతచేయడం కూడా అవసరం.
ఆన్‌లైన్ అప్లికేషన్ ఇలా..
* PM యశస్వి స్కాలర్‌షిప్ యోజన కోసం, ముందుగా https://socialjustice.gov.in/ వెబ్‌సైట్ సందర్శించాలి.
* హోమ్‌పేజీకి వెళ్లిన తరువాత PM యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ లింక్‌పై క్లిక్ చేయండి.
* అనంతరం నమోదు చేసుకోండి. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ SMS ద్వారా మీ ఫోన్‌కు వస్తుంది.
* ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి, కావాల్సిన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
* అనంతరం మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది.
కాగా, ప్రధాన మంత్రి యశస్వి స్కాలర్‌షిప్ పథకం కోసం, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్లికేషన్ లింక్‌ను యాక్టివేట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ స్కాలర్ షిప్ కోసం అప్లై చేసుకున్న విద్యార్ధులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది.