సరికొత్త రికార్డుకు చేరువలో TCS…అత్యధిక ఉద్యోగులు పనిచేస్తున్న ఐటీ కంపెనీలు ఇవే..!

TCS Employees: దేశ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్(TCS) సరికొత్త రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక ఐటీ ఉద్యోగులు టీసీఎస్ లోనే పనిచేస్తున్నారు.

  • Janardhan Veluru
  • Publish Date - 5:27 pm, Wed, 14 April 21
సరికొత్త రికార్డుకు చేరువలో TCS...అత్యధిక ఉద్యోగులు పనిచేస్తున్న ఐటీ కంపెనీలు ఇవే..!
TCS

దేశ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్(TCS) సరికొత్త రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక ఐటీ ఉద్యోగులు టీసీఎస్ లోనే పనిచేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 5 లక్షల మార్క్ ను అధిగమించనుంది. ప్రపంచంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒక్కటైన టీసీఎస్..దేశ, విదేశాల్లో పలు ఐటీ ప్రాజెక్టులు చేపడుతోంది. భారత్‌లో అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్  అమెరికా సహా పలు విదేశాలకు కూడా సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేస్తోంది. దేశం నుంచి అత్యధిక సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేస్తున్న ఐటీ కంపెనీగా గుర్తింపు సాధించింది.

1968లో ఏర్పాటైన టీసీఎస్…అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదిగింది. ఐటీ సేవలతో పాటు, బిజినెస్, కన్సల్టెన్సీ, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్స్ విభాగాల్లో సేవలందిస్తూ కోట్లాది రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. రికార్డు స్థాయి సాఫ్ట్ వేర్ ఎగుమతులతో భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. జూన్ నెలాఖరునాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5 లక్షల మార్క్ ను అధిగమించి..మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తి నాటికి ఆ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,88,649. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ గత ఆర్థిక సంవత్సరం ఆ సంస్థ కొత్తగా 40,185 మందికి ఉద్యోగాలిచ్చింది. కేవలం చివరి త్రైమాసం (జనవరి – మార్చి 2021) కాలంలోనే ఆ కంపెనీలో 19,388 మంది కొత్త ఉద్యోగులు చేరారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40వేలకు పైగా కొత్తగా ఫ్రెషర్లను తీసుకుంటామని టీసీఎస్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసం ముగిసేనాటికే టీసీఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 5 లక్షల మార్క్‌ను అధిగమించనుంది. దేశంలో ఈ ఘనత సాధించనున్న తొలి ఐటీ సంస్థ టీసీఎస్ కావడం విశేషం.

IT Employee

IT Employee

మరి దేశంలో ఏయే ఐటీ కంపెనీల్లో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారో తెలుసా? 2020 జూన్ తో ముగిసిన క్వార్టర్ నాటికి.. భారత్ లోని టాప్ 5 ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, విప్రో, మహీంద్రా కంపెనీల మొత్తం ఉద్యోగుల సంఖ్య 11.38 లక్షలు.

జూన్ 2020 నాటికి… టాప్ 10 ఐటీ కంపెనీలు- ఉద్యోగులు సంఖ్య

1. టీసీఎస్… 4,48,464 మంది ఉద్యోగులు
2. ఇన్ఫోసిస్…2,42,371 ఉద్యోగులు
3. హెచ్ సీఎల్… 1,50,000
4. విప్రో లిమిటెడ్…1,80,000
5. టెక్ మహీంద్రా లిమిటెడ్..1,25,236
6. లార్సన్ అండ్ టబ్రో ఇన్ఫోటెక్ లిమిటెడ్.. 31,437
7. ఎంఫేసిస్ లిమిటెడ్..22,239
8. మైండ్ ట్రీ లిమిటెడ్.. 21,991
9. హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్..18,294
10. కోఫోర్జ్( గతంలో ఎన్ఐఐటీ).. 10,000 మంది ఉద్యోగులు