NEET Exam Centre: రాజమండ్రిలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు వైసీపీ ఎంపీల వినతి.. ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులకు ఊరట దక్కేనా.?

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు ఆ ప్రాంత ఎంపీలు విజ్ఞప్తి చేశారు...

NEET Exam Centre: రాజమండ్రిలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు వైసీపీ ఎంపీల వినతి.. ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులకు ఊరట దక్కేనా.?
Margani Bharath
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 29, 2021 | 6:15 PM

NEET Exam Centre – Rajahmundary : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నీట్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు ఆ ప్రాంత ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఇవాళ కేంద్రమంత్రిని ఢిల్లీలో కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్, పిల్లి సుభాష్ చంద్రబోస్, చింతా అనురాధ ఈ మేరకు కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 13,000 మంది నీట్ అభ్యర్థులున్నారని పేర్కొన్న ఎంపీలు, వాళ్లంతా పరీక్ష కోసం 250-300 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోందని కేంద్రమంత్రికి విన్నవించారు.

ఏపీలో 11 నీట్ సెంటర్లున్నా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కటి కూడా లేదని పేర్కొన్న ఎంపీల బృందం.. వీరంతా విజయవాడ లేదా విశాఖపట్నం వెళ్లాల్సి వస్తోందని, ఇది విద్యార్థులతోపాటు, అటు తల్లిదండ్రులకు కూడా ఇబ్బందికరంగా మారిందని కేంద్రమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఇలా ఉండగా, దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌- 2021 పరీక్ష తేదీలకు సంబంధించి కేంద్రం జూలై 12వ తేదీన స్వల్ప మార్పులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కొత్త తేదీలను వెల్లడించారు. సెప్టెంబర్ 12న కరోనా నిబంధనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను నిర్వహిస్తామని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా నీట్(యూజీ) పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Read also :  Bharti Arora: మహిళా సీనియర్‌ ఐపీఎస్‌ సంచలన నిర్ణయం.. ఇక తన జీవితం శ్రీకృష్ణుడి సేవకు అంకితమంటూ..