న్యూఢిల్లీ, అక్టోబర్ 24: దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ల ఉద్యోగ నియమకాలకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి, లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ప్రాథమిక రాత పరీక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2 వేల పీవో ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత బేసిక్ పే స్కేల్ కింద రూ.41,960 అందుకుంటారు. రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో మాత్రమే జరుగుతుంది. పరీక్ష రోజున ఆయా పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, అడ్మిట్ కార్డుతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలు కూడా అభ్యర్ధులు తమతోపాటు తెచ్చుకోవల్సిందిగా ఎస్‌బీఐ సూచించింది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (సీజీఎల్) పరీక్ష-2023కు సంబంధించి టైర్ 2 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జులైలో నిర్వహించిన టైర్ 1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు టైర్-2 పరీక్షలు రాసేందుకు అర్హులు. పరీక్షకు హాజరయ్యే అర్హులైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్‌తో లాగినయ్యి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 25, 26, 27 తేదీల్లో టైర్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని దాదాపు 7,500 ఖాళీలను ఎస్సెస్సీ భర్తీ చేయనుంది. టైర్ 2 ఎగ్జామినేషన్ అనంతరం డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్ అండ్ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి ఆయా పోస్టులకు నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 వరకు జీతభత్యలు చెల్లిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.