
హైదరాబాద్, జనవరి 28: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల నుంచి వరుసగా విద్యార్ధులకు వివిధ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకోవడానికి అన్ని ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లపై జియో ట్యాగింగ్‌తో కూడిన క్యూఆర్ కోడ్‌ను ముద్రించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జరిపిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పరీక్ష కేంద్రాలను కనుగొనడంలో విద్యార్ధులు గందరగోళ పడకుండా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. గూగుల్ మ్యాప్ ద్వారా నేరుగా పరీక్షా కేంద్రంకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా విద్యార్థులు ఒక పరీక్ష కేంద్రానికి బదులు మరొక పరీక్ష కేంద్రానికి వెళ్లకుండా, సకాలంలో పరీక్షా కేంద్రాలకు సులభంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా విద్యార్ధులు తమ ఇంటి నుంచే పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉంది? ఎంత సమయం పడుతుందో? సులువుగా అంచనా వేసుకోవడానికి వీలుంటుంది. నిజానికి గతేడాదే ఈ పద్ధతి ప్రవేశ పెట్టింది. ఈఏపీసెట్ పరీక్ష హాల్‌టికెట్లపై తొలుత గత ఏడాదే క్యూఆర్ కోడ్ ముద్రించగా.. అది సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో ఈసారి లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్ సహా.. అన్ని హాల్‌టికెట్లపై కూడా క్యూఆర్ కోడ్ ముద్రించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈసారి ఉపకులాల వారీగా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. తద్వారా కులాల వారీగా ఏ కోర్సుకు ఎంత మంది దరఖాస్తు చేస్తున్నారు? ఎంత మంది ప్రవేశాలు పొందుతున్నారనే వివరాలు తెలుసుకునేందుకు సులభం అవుతుంది. అందుకే ఈసారి ఎస్సీలతోపాటు బీసీల్లో కూడా ఉపకులాల వారీగా దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించారు.
మరోవైపు గత ఏడాది ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల్లో మాక్ కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించారు. ఇందులో అభ్యర్థులు ఆప్షన్లు ఇచ్చుకోవడంలో నైపుణ్యం పొంది.. అసలు కౌన్సెలింగ్‌లో పొరబాట్లు దిద్దుకున్నారు. తొలివిడతలో దాదాపు 40 వేల మంది ఆప్షన్లు మార్చుకున్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌కు ముందు కూడా రెండోసారి మాక్ కౌన్సెలింగ్ నిర్వహించాలని వందలమంది తల్లిదండ్రులు కోరినప్పటికీ అయితే అప్పటికే షెడ్యూల్ నిర్ణయించడంతో వీలు పడలేదు. ఈ క్రమంలో ఈసారి ఉన్నత విద్యా మండలి రెండో విడత మాక్ కౌన్సెలింగ్‌ను కూడా నిర్వహించాలని భావిస్తుంది. మొత్తంగా ఉన్నత విద్యామండలి చొరవతో ఈసారి ప్రవేశ పరీక్షల తీరులో గణనీయమైన మార్పులు రానున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.