న్యూఢిల్లీ, జులై 9: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ 2024 పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్ లీకైన మాట వాస్తవమేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇది 23 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తుకు ముడిపడిన అంశం అయినందున.. ‘నీట్ రీటెస్ట్’ను నిర్వహించాలని ఆదేశించడం చివరి ఆప్షన్‌గా పరిగణిస్తామని వెల్లడించింది. అసలైన నిందితుల్ని గుర్తించలేనినాడు మేమే రీఎగ్జామ్‌కు ఆదేశిస్తామని స్పష్టం చేసింది.
నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలన్న పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. నీట్ యూజీ పరీక్షల్లో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీలిని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘నీట్ ప్రశ్నపత్రం లీకైందన్న విషయం స్పష్టమైంది. ఇది ఒప్పుకోవల్సిన విషయమే. కానీ అసలు సమస్య ఏంటంటే.. అసలు ప్రశ్నాపత్రం ఎంతమందికి చేరింది, ఎవరెవరు లీకేజీ వల్ల లాభపడ్డారు వంటి విషయాల్లో ఈ కేసులో తప్పొప్పులను పరిశీలించవల్సి ఉంది. పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా, నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా, లీకైన ప్రశ్నపత్రం సోషల్‌మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తాం. కానీ, రీ-టెస్ట్‌కు ఆదేశించే ముందు.. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది.
NEET-UG 2024 exam: Supreme Court observes that one thing is clear that leak (of question paper) has taken place. The question is, how widespread is the reach? The paper leak is an admitted fact. pic.twitter.com/qyfZQESMsx
— ANI (@ANI) July 8, 2024
పేపర్ లీకేజీకి ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు.. కానీ, ఇది 23 లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశం. అందువల్ల, లీక్ ఎలా జరిగింది.. ఎక్కడకెక్కడ జరిగింది? పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితులను ట్రేస్ చేసేందుకు ఎన్టీఏ తీసుకున్న చర్యలేంటి? ఎంత మంది ఫలితాలు నిలిపివేశారు.. వంటి వీటికి సమాధానాలు కావాలని కేంద్రాన్ని ఆదేశించింది. వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ధర్మాసనం ఆదేశించింది. అన్నీ పరిశీలించిన తర్వాత దీనిపై తీర్పు చెబుతామని వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకూ దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చిందో తెలుపుతూ నివేదిక సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. కాగా మే 5న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ 2024 పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం.. పరీక్షకు ముందురోజు రాత్రి లీకైనట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పైగా ఫలితాల్లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి కొత్త ర్యాంకులను ఎన్‌టీఏ జారీ చేసింది. ఈ పంచాయితీ తేలేవరకు కౌన్సెలింగ్‌ను కూడా తాజాగా వాయిదా వేసింది.