NEET UG 2026: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్ విధానంలో నీట్ యూజీ పరీక్ష.. కేంద్రమంత్రి ప్రకటన
కంచె చేను మేసిన చందంగా ఎన్టీయే నుంచే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు సీబీఐ వెల్లడించింది. ఎన్టీయేలో పేపర్ ప్రింట్ నుంచి పూణెకు చెందిన ఓ వ్యక్తి చేతికి క్వశ్చన్ పేపర్ అందినట్లు తెలిపింది. దీంతో దేశంలోనే అతి పెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటైన నీట్ విశ్వసనీయత, భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తింది..

హైదరాబాద్, మే 15: నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం (మే 15) మీడియాకు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడంతో.. తిరిగి జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఈ రోజు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. రీఎగ్జామ్ పెన్‌పేపర్ విధానంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షను నిష్పక్షపాతంగా, దోషరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. పేపర్ లీక్ ఎలా జరిగిందనేదానిపై పూర్తి వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు.
జూన్ 21న జరిగే రీ-టెస్ట్ కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, పరీక్ష రాసేందుకు విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకునేందుకు వారం రోజుల సమయం ఇస్తామన్నారు. జూన్ 14న నీట్ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. జూన్ 21న జరిగి ఈ పరీక్షలో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షకు సంబంధించిన సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లోనే తనిఖీ చేసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఎన్టీయే విజ్ఞప్తి చేసింది. పరీక్షా ప్రక్రియకు సంబంధించిన సందేహాల కోసం అభ్యర్థులు NTA అధికారిక హెల్ప్‌లైన్ నంబర్లు 011-40759000 లేదా 011-69227700 ద్వారా సంప్రదించవచ్చు. సందేహాలను neet-ug@nta.ac.in ఈమెయిల్ చిరునామాకు కూడా పంపవచ్చు.
మరోవైపు మే 3న జరిగిన నీట్ పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తక్కువ సమయంలో మళ్లీ సిద్ధమవ్వాలంటే ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనల గురించి చాలా మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అటు సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలోని ఇంటి దొంగలను పట్టించే పనిలో మునిగిపోయింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




