MBBS Admissions: వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత అంశంపై సుప్రీం కోర్టులో మళ్లీ రగడ.. నవంబరు 11 తర్వాత విచారణ
తెలంగాణ రాష వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు వచ్చినా.. స్థానికత విషయంపై విద్యార్ధుల్లో గందరగోళం మాత్రం తొలగిపోలేదు. గతంలో 133 మందికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తమకూ వర్తింపజేయాలని కొందరు అభ్యర్ధులు సుప్రీంకోర్టు తలపు తట్టారు..
హైదరాబాద్, అక్టోబర్ 16: నీట్ కౌన్సెలింగ్‌లో స్థానికత వివాదం ఎడతెగని ప్రహసనంలా కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 9, 10, 11, 12 తరగతులు చదవడంతోపాటు, స్థానికంగా నీట్ పరీక్ష రాసిన వారికే వైద్య విద్య ప్రవేశాల్లో 85 శాతం స్థానిక కోటా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 33ను సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇదివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించిన 133 మంది విద్యార్థుల్లో, 115 మందికి ఇప్పటి వరకూ ప్రవేశం కల్పించడంతో వారి ప్రవేశాలలో జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు అక్టోబరు15న దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలోని అంశాలపై దీపావళి సెలవుల తర్వాత పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన 133 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఇస్తూ సెప్టెంబరు 20న ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల వల్ల న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కొందరికే ప్రయోజనం కలుగుతోందని, వారితోపాటు సమాన అర్హతలున్న తమకూ అదే ఉత్తర్వులను వర్తింపజేయాలని మరికొంత మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం జీవో 33ని వచ్చే ఏడాది నుంచి అమలుచేయడానికి వీలుందేమో పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. లేనిపక్షంలో ఆ జీవోను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన 133 మంది కౌన్సిలింగ్‌లో పాల్గొనడానికి ఇచ్చిన మినహాయింపును తొలగిస్తే తలెత్తే పరిణామాల గురించి అభిప్రాయం చెప్పాలను కోరింది. ఈ రెండు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలిపే అభిప్రాయం ప్రకారం స్థానికత అంశంపై తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని పేర్కొన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వాయిదా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ కౌన్సిలింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది. ఈ దశలో స్థానికత అంశం మళ్లీ తెరపైకి రావడంతో గందరగోళం నెలకొంది.
’40 శాతం వైకల్యం ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి అవరోధం కాదు’ సుప్రీంకోర్టు స్పష్టీకరణ
శారీరక వైకల్యం ప్రామాణిక 40 శాతం, అంతకన్నా అధికంగా ఉన్నంత మాత్రాన ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి అర్హతకాలేరని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైద్యవిద్యను అభ్యసించే విద్యార్థికి తగిన సామర్థ్యం, అర్హతల గురించి నిపుణులు సమర్పించే నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలితప్ప.. శారీరక వైకల్యం ఆధారంగా కాదని ధర్మాసనం తెలిపింది. దీంతో ఎంబీబీఎస్‌లో చేరడానికి ఓంకార్ అనే విద్యార్థికి అనుమతిస్తూ సెప్టెంబరు 18న వెలువరించిన ఉత్తర్వులకు సంబంధించిన సమగ్ర కారణాలను వెల్లడించింది. వైద్య విద్యలో ప్రవేశానికి ఓంకార్ అర్హుడేనని, అతని వైకల్యం కారణంగా ఎంబీబీఎస్ చదువుకు అనర్హత కాదని మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికను ధర్మాసనం ఉటంకించింది. వైకల్యం ప్రామాణికత 40 శాతాన్ని మించితే ఎంబీబీఎస్‌లో ప్రవేశ అర్హత ఉండదన్న గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ 1997ను సవాల్ చేస్తూ ఓంకార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఈ కేసు విచారించిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.