NEET PG 2025 Counselling: నీట్ పీజీ 2025 కౌన్సెలింగ్ మరింత ఆలస్యం.. కారణం ఇదే!
Supreme Court postpones NEET PG 2025 hearing by 2 weeks: నీట్ పీజీ 2025 పరీక్ష పారదర్శకతకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు రెండు వారాల పాటు వాయిదా వేసినట్లు వెల్లడించింది. దీంతో మెడికల్ అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది..

హైదరాబాద్, సెప్టెంబర్ 14: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) 2025లో పారదర్శకతకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు రెండు వారాల పాటు వాయిదా వేసినట్లు వెల్లడించింది. దీంతో కౌన్సెలింగ్, అడ్మిషన్లకు సంబంధించి వేలాది మంది మెడికల్ అభ్యర్ధులు గందరగోళంలో పడిపోయారు. నిజానికి ఈ కేసుకు సంబంధించిన విచారణ అక్టోబర్‌లో విచారణ జరగాల్సి ఉంది. అయితే కౌన్సెలింగ్ ఆలస్యం, విధానపరమైన అస్పష్టతపై విద్యార్ధుల్లో పెరుగుతున్న ఆందోళనల కారణంగా విచారణ ప్రక్రియ వేగంగా చేపట్టాలని కోర్టు భావించింది. అందుకే సెప్టెంబర్ 4న, ఆ తర్వాత సెప్టెంబర్ 12న కేసు విచారించడానికి అంగీకరించింది. అయితే పరీక్ష పారదర్శకత అంశంపై స్పష్టత కొరవడడంతో విచారణలను 2 వారాలకు వాయిదా వేసినట్లు కోర్టు తెలిపింది.
అసలేం జరిగిందంటే?
ఆగస్టు 21న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) జారీ చేసిన దిద్దుబాటు నోటీసును సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. తొలుత NBEMS పూర్తి ప్రశ్నల సెట్, అధికారిక సమాధాన కీని విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, కేవలం ప్రశ్న ID నంబర్‌లను మాత్రమే విడుదల చేయడంపై కొందరు అభ్యర్ధులు కోర్టుకు వెళ్లారు. ఈ పద్ధతి తమ సమాధానాలను ఖచ్చితంగా ధృవీకరించకుండా నిరోధిస్తుందని అభ్యర్థులు వాదించారు. ఈ ఫార్మాట్ అపారదర్శకంగా ఉంది. అభ్యర్థులకు న్యాయమైన పరీక్షా ప్రక్రియకు మూలస్తంభమైన పారదర్శకత లోపించేలా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్లు తమ పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయమని కోరడం లేదని, ప్రశ్నలు, ప్రతిస్పందనలు, సరైన సమాధానాలు, ఇచ్చిన మార్కులను సరైన విధంగా బహిర్గతం చేయమని మాత్రమే కోరుతున్నామని అందులో స్పష్టం చేశారు.
అయితే అనూహ్యంగా అత్యున్నత న్యాయస్థానం విచారణను 2 వారాలకు వాయిదా వేయడంతో.. నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లపై అనిశ్చితి నెలకొంది. దేశంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో అడ్మిషన్ల పారదర్శకత, నిర్వహణ రెండింటినీ నిర్ధారించడానికి సకాలంలో తీర్పు అవసరమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




