KNRUHS PG Counselling 2024: పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌కు ఎదురుచూపులు.. ఇంకా వెలువడని నోటిఫికేషన్
రాష్ట్రంలో పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ ప్రశ్నార్ధకంగా మారింది. నీట్ పీజీ పరీక్ష జరిగి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు స్టేట్ ర్యాంకులు ప్రకటించలేదు. ఇక కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఊసే లేదు. పక్క రాష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రక్రియ రేపో మాపో ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ ప్రకటనలో జాప్యం కారణంగా విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది..
హైదరాబాద్, నవంబర్ 1: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీలో పీజీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ కోసం విద్యార్ధులు పడిగాపులు కాస్తున్నారు. రోజులు గడుస్తున్నా నోటిఫికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం నెలకొనడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. అటు ఏపీలో ఇప్పటికే పీజీ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలవగా.. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థానిక కోటాకు సంబంధించిన ర్యాంకులు కూడా విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నుంచి తెలంగాణలో ఏపీ విద్యార్థులకు, ఏపీలో తెలంగాణ విద్యార్థులకు కేటాయించే 15 శాతం కోటా నిలిచిపోనుంది. దీంతో ఏ రాష్ట్రం విద్యార్ధులు ఆ రాష్ట్రంలోనే సీట్లు పొందాల్సి వస్తుంది. ఇందుకు సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది కూడా. త్వరలోనే ఆ రాష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది.
ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ విద్యార్థులకు కోటాను ఈ ఏడాది నుంచి తొలగిస్తున్నట్లు జీవో విడుదల చేసింది. అయితే పీజీ ప్రవేశాల్లో మార్గదర్శకాలపై ఇంకా ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ‘నీట్’ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించి 2 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో ప్రవేశాలకు సంబంధించి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. తెలంగాణలో గత ఏడాది వరకు 3 వేల పీజీ సీట్లు ఉండేవి. అయితే మల్లారెడ్డి కళాశాల డీమ్డ్ వర్సిటీ కావడంతో 200 సీట్లు ఈ ఏడాది తగ్గాయి. దీంతో మొత్తం 2,800 పీజీ సీట్లు ఉండగా, వాటిల్లో అఖిలభారత కోటా కింద 50 శాతం పోగా.. మిగిలిన సుమారు 1400 సీట్లు మాత్రమే రాష్ట్ర విద్యార్థులకు ఉంటాయి. విభజన హామీల్లో భాగంగా గతఏడాది వరకు స్థానిక కోటాలో 15 శాతం సీట్లు ఏపీ విద్యార్థులకు కేటాయిస్తూ వచ్చారు. ఈసారి నుంచి ఆ కోటా లేనందున రాష్ట్ర విద్యార్థులకే అన్ని స్థానిక కోటా సీట్లు దక్కాలి. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు కాళోజీ వర్సిటీ రాష్ట్ర మెరిట్ జాబితా కూడా విడుదల చేయలేదు. ఇప్పటి వరకు కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఒక్క అడుగు కూడా రాష్ట్ర సర్కార్ వేయకపోవడంతో విద్యార్థులు తమకు ఏ కళాశాలలో ఏ బ్రాంచిలో సీటు వస్తుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.
రాష్ట్రంలో సీటు దక్కడం విషయమై స్పష్టతవస్తే.. విద్యార్థులు జాతీయ వైద్య విద్యాసంస్థల్లో పీజీ ప్రవేశాల కోసం నవంబరు 10న జరిగే ‘INI CET’ ప్రవేశ పరీక్ష కోసం సిద్ధం అయ్యేందుకు వీలుంటుంది. పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం వల్ల తాము నష్టపోయే అవకాశం ఉందని రాష్ట్ర విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం జీవో విడుదల చేస్తే.. ఆ వెంటనే కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ ఇస్తామని కాళోజీ వర్సిటీ అధికారులు చెబుతున్నారు.