Telangana: ఘోరం.. హాస్టల్ భవనంపై నుంచి దూకేసిన ఇంటర్ విద్యార్థిని! ఏం జరిగిందో
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధిని హాస్టల్ వసతి గృహంపై నుంచి అమాంతం కిందికి దూకేసింది. ఏం జరిగిందో తెలియదుగానీ విద్యార్ధిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు..
సంగారెడ్డి, నవంబర్ 14: ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్ధిని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం భవనంపై నుంకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లాలోని నారాయఖేడ్‌లోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహంలో మాధవి అనే విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక ఉన్నట్లుండి హాస్టల్ భవనంపై నుంచి కిందకు దూకేసింది. వెంటనే గమనించిన హాస్టల్ సిబ్బంది తీవ్రంగా గాయపడిన మాధవిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు.
మరో ఘటన: రైలు ఎక్కుతుండగా జారిపడి.. కొరుట్ల యువతి మృతి
కోరుట్ల, నవంబర్ 14: రైలు ఎక్కుతుండగా ఓ యువతి ప్రమాదవశాత్తు జారి పడిపోయింది. ఈ రైలు ప్రమాదంలో గాయపడిన యువతి చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్లలోని ప్రకాశం రోడ్‌కు చెందిన సామల్ల గణేశ్, నీరజ దంపతులు తమ కుమార్తె ఉదయశ్రీతో కలిసి నవంబర్ 11న (సోమవారం) తిరుపతికి బయల్దేరారు. తిరుపతికి వెళ్లేందుకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు ముగ్గురూ చేరుకున్నారు. అక్కడ రైలు ఎక్కుతుండగా ఉదయశ్రీ ప్రమాదవశాత్తు జారిపడి పోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందింది. గణేశ్, నీరజ దంపతులకు ఉదయశ్రీ ఏకైక సంతానం. దీంతో ఒక్కగానొక్క కూతురి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో కోరుట్లలో విషాదం నెలకొంది.