AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Degree Syllabus: డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ అమలు

సంప్రయాద డిగ్రీ కోర్సుల్లో సిలబస్ ఎప్పటికోగాని మారదు. ఏదో తూతూ మంత్రంగా ఆయా కాలేజీలు పాఠాలు చెప్పి, పరీక్షలు పెట్టి డిగ్రీ పట్టాలు ఇచ్చి.. మమ అనిపించేస్తున్నాయి. దీంతో విద్యార్ధులు బయటకు వచ్చాక ఉద్యోగాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పద్ధతికి స్వస్తి చెప్పేందుకు ఉన్నత విద్యా మండలి కంకనం కట్టుకుంది..

Degree Syllabus: డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ అమలు
Degree Syllabus
Srilakshmi C
|

Updated on: Nov 14, 2024 | 3:12 PM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 14: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ఆరేళ్ల తర్వాత కొత్త పాఠ్య ప్రణాళికరానుంది. ఈ మేరకు డిగ్రీ సిలబస్‌ను సమీక్షించి ఇప్పటికి అవసరాలకు తగ్గట్లు మార్చాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇంజినీరింగ్‌ కోర్సులకు యూనివర్సిటీలు మూడేళ్లకోసారి రివిజన్‌ చేస్తుండగా, సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో సిలబస్‌ మాత్రం ఎప్పటికప్పుడు మార్పులకు నోచుకోవడం లేదు. నామమాత్రంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి, పరీక్షలు నిర్వహించి, పట్టాలిచ్చి పంపించేస్తున్నారు. దీంతో ఆయా డిగ్రీలు వారికి ఏ విధంగానూ ఉపయోగపడక అవస్థలు పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ సిలబస్‌ను మార్చేందుకు ఉన్నత విద్యామండలి కార్యచరన రూపొందించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఏటా ఇంజినీరింగ్‌లో దాదాపు లక్ష మంది విద్యార్ధులు ప్రవేశాలు పొందుతున్నారు. బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఎం, బీబీఏ, బీసీఏల్లో 2 లక్షల మంది విద్యార్ధులు చేరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, యూనివర్సిటీ, రెసిడెన్షియల్, ప్రైవేట్, డిగ్రీ కళాశాలలు 1100 వరకు ఉన్నాయి. వాటిలో 80 ప్రభుత్వ, మరో 20 ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు యూజీపీ ప్రతిపత్తి ఉంది. దీంతో ఆ కాలేజీలకు 20 నుంచి 30 శాతం సిలబస్‌ మార్చుకునే అవకాశం ఉంది. దీంతో అవి ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. మిగిలిన కాలేజీల్లో మాత్రం ఉన్నత విద్యామండలి నిర్ణయించిందే సిలబస్‌గా కొనసాగుతుంది. ప్రస్తుతం నైపుణ్యం ఉన్న విద్యార్థులకే ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను సమీక్షించి, నేటి అవసరాలకు తగ్గట్లుగా దానిని మార్చాలని విద్యామండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించి త్వరలో సబ్జెక్టు రివిజన్‌ కమిటీలను నియామకం చేయనుంది. ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్ధులకు ఉద్యోగావకాశాలు దక్కేలా వారిలో నైపుణ్యాలను పెంచడం, కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయడం ధ్యేయంగా సిలబస్‌లో మార్పులు చేసేందుకు సంకల్పించింది. దీనితోపాటు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులకు పెద్దపీట వేయడంవంటి చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. వీలైనంత వరకు డిగ్రీ కొత్త సిలబస్‌కు సాంకేతికతను మిళితం చేయాలని యోచిస్తుంది.

తరగతి గది బోధనకు ప్రాధాన్యం తగ్గించి ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేయాలని నిపుణులు సూచిస్తురు. ఉన్నత విద్యామండలి మాత్రం త్వరలో సబ్జెక్టులు వారీగా నిపుణుల కమిటీలను నియమించి సమీక్షించాలని నిర్ణయించినట్లు సమాచారం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ అమల్లోకి తీసుకువచ్చేలా కార్యచరణ రూపొందిస్తుంది. విద్యామండలి నిర్ణయించిన సిలబస్‌తో తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను సైతం ముద్రించనున్నారు. కాగా రాష్ట్రంలో చివరిసారిగా 2019లో డిగ్రీ పాఠ్యప్రణాళికను మార్చారు. అంటే ఇప్పటి వరకు 6 విద్యా సంవత్సరాలు పూర్తయ్యాయి. గత మూడేళ్లలో బీకాం డేటా సైన్స్, బీఎస్‌సీ ఏఐ అండ్‌ ఎంఎల్‌ లాంటి విభిన్న కోర్సులను ప్రవేశపెట్టినా పాఠ్య ప్రణాళిక మార్పుపై మాత్రం పెద్దగా దృష్టి సారించలేదు. ఈ విద్యాసంవత్సరం పూర్తయ్యేలోగా అన్ని డిగ్రీ కోర్సుల్లో సిలబస్‌ మార్చాలని ఉన్నత విద్యామండలి అడుగులు వేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.